Kashmir: నిఘా వర్గాల హెచ్చరికలు.. 48 టూరిస్టు కేంద్రాల మూసివేత

by Shamantha N |

జమ్ముకశ్మీర్‌లోని పహెల్గాం దాడి తర్వాత 48 టూరిస్టు కేంద్రాలు మూతపడ్డాయి. కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

Kashmir: నిఘా వర్గాల హెచ్చరికలు.. 48 టూరిస్టు కేంద్రాల మూసివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని పహెల్గాం దాడి తర్వాత 48 టూరిస్టు కేంద్రాలు మూతపడ్డాయి. కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అందులో భాగంగానే కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 టూరిస్టు కేంద్రాల్లో 48 కేంద్రాలను మూసివేసినట్లు తెలుస్తోంది. హపెల్గాం ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ లోయలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో, కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. రాబోయే రోజుల్లో భద్రతాదళాలు, స్థానికేతర వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు చురుగ్గా దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

కశ్మీర్ లో దాడులకు ప్రణాళికలు..

పాకిస్తాన్ గూఢచారి సంస్థ, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ముఖ్యంగా శ్రీనగర్, గండర్‌బాల్ జిల్లాల్లో స్థానికేతర వ్యక్తులు, భద్రతా సిబ్బంది, కశ్మీరీ పండిట్లపై లక్ష్యంగా దాడులు చేసే అవకాశముందని నిఘా వర్గాలు తెలిపాయి. పహెల్గామ్ దాడి తర్వాత ఉత్తర, మధ్య, దక్షిణ కశ్మీర్‌లలోని ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేసినందుకు ప్రతీకారంగానే దాడికి ప్రణాళిక వేస్తున్నారని నిరంతర నిఘా నివేదికలు సూచిస్తున్నాయి. కశ్మీర్ లోయలో స్థానికేతర రైల్వే సిబ్బంది గణనీయంగా ఉండటంతో రైల్వేలను లక్ష్యంగా దాడి చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని హెచ్చరించింది. రైల్వే భద్రతా సిబ్బంది తమ శిబిరాలు, బ్యారక్‌ల వెలుపలకు సాధ్యమైనంతవరకు రావొద్దని సూచించింది. నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకుంటుంది. భద్రతాదళాలు, జమ్ముకశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ నుండి యాంటీ-ఫిదాయిన్ స్క్వాడ్‌లు గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ లేక్ ప్రాంతాలతో సహా సున్నితమైన పర్యాటక ప్రదేశాలకు మోహరించాయి.

Next Story