- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లలే మన రాష్ట్ర సంపద.. వారితోనే ఆర్థిక ప్రగతి : సీఎం చంద్రబాబు
పిల్లలే మన రాష్ట్ర సంపద అని, వారితోనే మన ఆర్థిక ప్రగతి ముడిపడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పిల్లలే మన రాష్ట్ర సంపద అని, వారితోనే మన ఆర్థిక ప్రగతి ముడిపడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచజనాభా దినోత్సవం సందర్భంగా విజయవాడ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల్ని పెంచే బాధ్యతను కేవలం తల్లులే కాకుండా తండ్రులు కూడా తీసుకోవాలని సూచించారు. ఆడవాళ్లకు మగవాళ్లు అన్ని పనుల్లోనూ సహాయం చేయాలని, ఇంటిపని, వంటపని అని తేడా చూడకూడదని హితవు పలికారు. అలాగే సోషల్ మీడియాను విపరీతంగా వాడటం వల్ల మానసిక సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని, నియంత్రణ లేకుంటే ఏ టెక్నాలజీ అయినా ప్రమాదమేనన్నారు. మెంటల్ సిక్ నెస్ అనేది ఇప్పుడు అతిపెద్ద సమస్యగా తయారైందన్నారు.
నేటి యువత యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని సీఎం సూచించారు. అలాగే నాయకత్వ లక్షణాలను పెంచుకుని, రాష్ట్ర భవిష్యత్తు కావాలన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని కోరామని, సంజీవని కింద డిజిటల్ ఆరోగ్య రికార్డు తీసుకుంటున్నామని తెలిపారు. కుటుంబ వ్యవస్థే మన దేశానికి అసలైన సంపద అని, ఆ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జనాభా తగ్గితే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేమన్న సీఎం చంద్రబాబు.. జనాభా పెంపుతోనే 2040కే స్వర్ణాంధ్ర సాధించుకునే సత్తా మనకు ఉందన్నారు. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుని, స్వార్థాన్ని వీడి.. కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ ప్రపంచానికి మనమంతా ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
పిల్లలే సంపద.. పెద్ద కుటుంబాలే శ్రీరామరక్ష
కుటుంబాలు కలిసి ఉంటేనే నిజమైన ఆనందం ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పిల్లలే మన సంపద.. పెద్ద కుటుంబానే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. 60 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ సమాజం కోసం పనిచేయాలన్నారు. మనం నిత్య విద్యార్థులమని, జీవితాంతం ఏదొక విషయాన్ని నేర్చుకుంటూనే.. నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. టెక్నాలజీ, నాలెడ్జ్ అన్నీ ఉన్నా.. వాటిని ఉపయోగించుకునే తెలివి ఉన్నప్పుడే జీవితం ముందుకు సాగుతుందన్నారు. సోలార్ విద్యుత్ ను ఇంటిపైనే తయారు చేసుకునే స్థాయికి చేరిన మనం.. మున్ముందు మరిన్ని ఆవిష్కరణలు తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు. త్వరలోనే డ్రోన్ అంబులెన్స్ కూడా వస్తుందని, ఫలితంగా ఎమర్జెన్సీ కేసుల్లో ఆలస్యం లేకుండా ఆస్పత్రులకు చేర్చవచ్చని వివరించారు.






