Unesco: 40 శాతం జనాభాకు సొంత భాషలో విద్య అందుబాటులో లేదు: యునెస్కో

by S Gopi |

స్థానిక భాషల పాత్రపై చాలా దేశాల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ, సరైన విధానాలను తీసుకురావడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

Unesco: 40 శాతం జనాభాకు సొంత భాషలో విద్య అందుబాటులో లేదు: యునెస్కో
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా కొత్త జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చాలా రాష్ట్రాలు ఇందుకు మద్దతివ్వగా, పాఠశాల విద్యలో మూడు భాషల విధానంపై కొన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. తమిళనాడు లాంటి రాష్ట్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సొంత భాషను ప్రభావితం చేసేలా, హిందీని తమపై రుద్దే ప్రయత్నంలో భాగంగానే ఎన్ఈపీని తీసుకొస్తున్నారని తమిళనాడు ప్రభుత్వంతో పాటు ప్రజలూ భావిస్తున్నారు. దీనిపై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున నిరసనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్(జీఈఎం) బృందం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ 25వ వార్షికోత్సవం సందర్భంగా మాతృభాషలను పరిరక్షించడం, ప్రోత్సహించడం కోసం చేసిన కృషి ఆధారంగా ఓ నివేదికను రూపొందించింది. 'భాషలు: బహుభాషా విద్యపై గ్లోబల్ గైడెన్స్' పేరుతో తీసుకొచ్చిన ఈ నివేదికలో పలు కీలక అంశాలను యునెస్కో బృందం ప్రస్తావించింది. ప్రపంచ జానాభాలో 40 శాతం మంది ఇప్పటికీ తాము మాట్లాడే, అర్థం చేసుకునే భాషలో విద్యను పొందలేకపోతున్నారని యునెస్కో తెలిపింది. స్థానిక భాషల పాత్రపై చాలా దేశాల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ, సరైన విధానాలను తీసుకురావడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా సొంత భాషలో బోధించే ఉపాధ్యాయులు, ఆయా భాషల్లో మెటీరియల్ లభ్యత లేకపోవడం వంటి అంశాలు విరోధంగా ఉన్నాయి.

సేకరించిన వివరాల ప్రకారం, కొన్ని తక్కువ, మధ్య-ఆదాయ దేశాల్లో 90 శాతం జనాభా ఇలా సొంత భాషలో విద్యకు దూరమవుతున్నారు. దాదాపు 25 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. దీన్ని మెరుగుపరిచేందుకు విద్యావ్యవస్థలో బహుభాషా విద్యా విధానాలు, అన్ని రకాల భాషల వారికి ప్రయోజనం లభించే విధంగా చర్యలు ఉండాలని జీఈఎం బృందం సభ్యులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వలసలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భాషా వైవిధ్యం సాధారణంగా మారింది. భిన్న భాషల నేపథ్యం నుంచి వచ్చి చదువుకునే వారు పెరిగారు. దీనివల్ల 3.1 కోట్లకు పైగా ప్రాంతాలు మారిన యువత విద్యకు సంబంధించి అవరోధనాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ పదేళ్ల కాలంలో యువత జీవితంలో టెక్నాలజీ ఎక్కువ భాగమైపోయింది. అలాగే ఐదేళ్ల క్రితం కొవిడ్-19 మహమ్మారి ప్రభావంతో పఠనాశక్తి మరింత పడిపోయింది. మరో కీలక అంశం భాషల కారణంగా చదువులో కొందరు వెనుకబడ్డారు. సొంత భాష నుంచి మరొక భాషలో నేర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని యునెస్కో బృందం తెలిపింది.

Next Story