Pahalgam Attack: పెహల్గామ్ ఉగ్రదాడిలో వెలుగులోకి వస్తున్న విషయాలు

by Shamantha N |

జమ్ముకశ్మీర్ లోని పెహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దాడిలో పాల్గొన్న ముష్కరుల వద్ద ఏకే 47 రైఫిల్స్, స్టీల్ టిప్డ్ బుల్లెట్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Pahalgam Attack: పెహల్గామ్ ఉగ్రదాడిలో వెలుగులోకి వస్తున్న విషయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ లోని పెహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దాడిలో పాల్గొన్న ముష్కరుల వద్ద ఏకే 47 రైఫిల్స్, స్టీల్ టిప్డ్ బుల్లెట్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాడిలో ఇద్దరు విదేశీ, ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు పాల్గొన్నారని నిఘా వర్గాలు తెలిపాయి. వారు బాడీ కామ్స్ ధరించినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రసంస్థల అగ్రనేతలు లైవ్ లో ఈ విధ్వంసాన్ని వీక్షించినట్లు అనుమానిస్తున్నారు. తొలుత పర్యాటకులందరినీ ఉగ్రవాదులు ఒకచోటుకు చేర్చి వారి గుర్తింపులను చెక్ చేశారని పేర్కొన్నారు. పర్యాటకుల్లో పురుషులను, మహిళలను వేరు చేశారని.. హిందూ పురుషులే లక్ష్యంగా దాడులు చేసినట్లు పేర్కొన్నారు. 15 నిమిషాల్లోనే ఉగ్రవాదులు బీభత్సం సృష్టించినట్లు వెల్లడించారు. భద్రతా సంస్థల వర్గాలు తెలిపిన ప్రకారం ఇద్దరు స్థానిక ఉగ్రవాదులను బిజ్‌బెహారాకు చెందిన ఆదిల్ ఠాకూర్, త్రాల్ కు చెందిన ఆసిఫ్ షేక్‌గా గుర్తించారు.

ప్రధాని పర్యటనలో..

అలాగే, ఇద్దరు ఉగ్రవాదులు పాష్టో భాషలో మాట్లాడారని భద్రతా బలగాలు తెలిపాయి. వారిద్దర్ని పాకిస్థాన్ కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఉగ్రవాదులు రెండువారాల ముందే సరిహద్దులకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాజౌరి, వాధావాన్ మీదుగా పెహల్గాం చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే,ఉగ్రవాదులు ముందుగానే వచ్చారని.. ఏప్రిల్ 19న ప్రధాని మోడీ కాత్రా పర్యటన సందర్భంగా దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన అధికారుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిందనే వార్తలను అధికార వర్గాలు ఖండించాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బంది ఒకరు కుటుంబంతో కలిసి సెలవులకు వచ్చారని.. మరణించిన వారిలో ఆయన కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.

Next Story