J&K: జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ వాహనం బోల్తా.. నలుగురు జవాన్లకు గాయాలు

by Shamantha N |   (  Updated:2025-01-27 15:36:43  IST  )

జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనానికి ప్రమాదం జరిగింది. అదుపుతప్పి వాహనం బోల్తా పడి నలుగురు సైనికులు గాయపడ్డారు.

J&K: జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ వాహనం బోల్తా.. నలుగురు జవాన్లకు గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనానికి ప్రమాదం జరిగింది. అదుపుతప్పి వాహనం బోల్తా పడి నలుగురు సైనికులు గాయపడ్డారు. పూంచ్‌లోని సుంజియాన్ ప్రాంతంలోని గంతర్ మోర్ వద్ద ఆర్మీ వాహనం అదుపుతప్పి.. గుంతలో పడిపోయిందని అధికారులు తెలిపారు. స్థానికుల సహాయంతో గాయపడిన జవాన్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఇకపోతే, గతేడాది డిసెంబర్ 24న పూంచ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు చనిపోగా.. 8 మంది గాయపడ్డారు.

గతేడాది పెరిగిపోయిన ఉగ్రదాడులు

మరోవైపు, గతేడాది జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడులు పెరిగిపోయాయి. అక్టోబర్ 20న ముష్కరులు జరిపిన దాడిలో ఐరుగురు వలస కార్మికులు, స్థానిక వైద్యుడు సహా ఏడుగురు చనిపోయారు. గందేర్‌బాల్ జిల్లాలోని గగన్‌గిర్ ప్రాంతంలోని కార్మికుల శిబిరంలోకి ఇద్దరు ముష్కరులు ప్రవేశించి దాడులు జరిపారు. గగన్‌గిర్ దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరిని శ్రీనగర్ లోని హర్వాన్ ప్రాంతంలో భద్రతాదళాలు హతమార్చాయి. అక్టోబర్ 24న గుల్మార్గ్‌లోని బోటపత్రి ప్రాంతంలో ఆర్మీ వాహనంపై ముష్కరులు మెరుపుదాడి చేసి ముగ్గురు జవాన్లు, ఇద్దరు సిబ్బంది సహా ఐదుగురిని చంపారు. నవంబర్ 2న శ్రీనగర్‌లోని పర్యాటక రిసెప్షన్ సెంటర్ సమీపంలో రద్దీగా ఉండే సండే మార్కెట్‌పై గ్రనైడ్ దాడి జరిగింది. ఆ దాడిలో ఒక మహిళ చనిపోగా.. మరో 11 మంది పౌరులు గాయపడ్డారు. కాగా.. గ్రనైడ్ దాడికి పాల్పడ్డ ముష్కరులను అధికారులు అరెస్టు చేశారు. శాంతియుతంగా లోక్ సభ ఎన్నికలు ముగియడంతో జమ్ముకశ్మీర్ పై ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం చూసి భయపడే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో దాడులు జరిగినట్లు నిఘా సంస్థలు భావిస్తున్నాయి.

Next Story