- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indians deported: అమెరికా నుంచి రెండో విడతలో భారతీయుల బహిష్కరణ
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. కాగా.. ఇప్పటికే 104 మంది భారత్ కు చెందిన అక్రమవలసదారులను బహిష్కరించారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. కాగా.. ఇప్పటికే 104 మంది భారత్ కు చెందిన అక్రమవలసదారులను బహిష్కరించారు. అయితే, ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో ఉన్న వేళ ప్రస్తుతం మరో వార్త సంచలనంగా మారింది. అమెరికాలో సరైన పత్రాలు లేకుండా అక్రమంగా ఉంటున్న భారతీయ వలసదారులను మరోసారి బహిష్కరిస్తున్నట్లు ట్రంప్ సర్కారు ప్రకటించింది. రెండో విడత భారతీయులతో శనివారం(ఫిబ్రవరి 15)న మరో విమానం అమృత్‌సర్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, ఫిబ్రవరి 05న 104 మంది భారతీయులను యూఎస్ మిలిటరీ విమానంలో అమృత్‌సర్‌కి తరలించారు. ఇదిలా ఉంటే, తాజాగా మరో విడత బహిష్కరణ మొదలైనట్లు తెలుస్తోంది.
487 మందికి నోటీసులు..!
అయితే, 487 మంది అనుమానిత భారతీయ పౌరులను బహిష్కరించేందుకు అమెరికా రెడీ అయ్యిందని.. ఈ విషయాన్ని భారత్ కు తెలియజేసిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ గతంలోనే చెప్పుకొచ్చారు. అక్రమవలసదారులతో అమెరికా అధికారులు అమానవీయంగా ప్రవర్తించారని.. కాళ్లు, చేతులను సంకెళ్లతో కట్టివేశారని బాధితులు ఆరోపించారు. అయితే, భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అమెరికా అధికారుల దగ్గర లేవనెత్తుతుందని హామీ ఇచ్చారు. మరోవైపు, అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి తెచ్చుకుంటామని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. ఇటీవలే రాజ్యసభలో జైశంకర్ మాట్లాడుతూ.. 2009 నుండి 15,668 మంది అక్రమ భారతీయ వలసదారులను యూఎస్ బహిష్కరించినట్లు చెప్పారు. అయితే, ఇటీవల యూఎస్ నుంచి భారతీయులను తీసుకువచ్చిన విమానాన్ని అమృత్‌సర్‌లో ల్యాండ్ చేయడంపై వివాదం నెలకొంది. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. పంజాబ్‌ని అప్రతిష్టపాలు చేయాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు. అక్రమ వలసదారులను తీసుకెళ్తున్న విమానం అమృత్‌సర్‌లో దిగేలా చూడటం ద్వారా ప్రభుత్వం పంజాబ్‌ను అప్రతిష్ట పాలు చేయాలని కోరుకుంటోందన్నారు. విమానాన్ని హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో ఎందుకు ల్యాండ్ చేయలేదని ప్రశ్నించారు.






