Operation Sindoor: 27 ఎయిర్‌పోర్ట్‌ల మూసివేత.. 430 విమానాల రద్దు

by S Gopi |

ఇవి సాధారణంగా దేశంలో షెడ్యూల్ విమానాల్లో 3 శాతానికి సమానం.

Operation Sindoor: 27 ఎయిర్‌పోర్ట్‌ల మూసివేత.. 430 విమానాల రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ముదురుతున్న నేపథ్యంలో దేశంలోని మొత్తం 27 విమానాశ్రయాలు మే 10వ తేదీ వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దేశీయ విమానయాన సంస్థలు గురువారం 430 విమానాలను రద్దు చేశాయి. ఫలితంగా శనివారం ఉదయం 5.29 గంటల వరకు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఇవి సాధారణంగా దేశంలో షెడ్యూల్ విమానాల్లో 3 శాతానికి సమానం. మన దేశంలోనే కాకుండా పాకిస్తాన్‌లోనూ ఆ దేశ విమానయాన సంస్థలు 147కి పైగా విమానాలను రద్దు చేశాయి. ఇవి వారి రోజువారీ షెడ్యూల్‌లో 17 శాతానికి సమానం. మనదేశంలో మూసివేత కారణంగా ప్రభావితమైన వాటిలో శ్రీనగర్, జమ్మూ, లేహ్, చండీగఢ్, అమృత్‌సర్, లూధియానా, ధర్మశాల, ముంద్రా, జామ్‌నగర్, రాజ్‌కోట్ సహా ఉత్తర, పశ్చిమ, మధ్య భారతంలోని ప్రధాన విమానాశ్రయాలున్నాయి. సున్నితమైన ప్రాంతాల మీదుగా వెళ్లకుండా ఉండేందుకు అనేక విమానయాన సంస్థలు తమ విమానాల రూట్లను సర్దుబాటు చేసుకుంటున్నాయి, కొన్ని విమానాలను రద్దు చేస్తున్నాయి. బుధవారం నాటికే 300కి పైగా విమానాలు రద్దవగా, గురువారం మరో 130 వరకు క్యాన్సిల్ అయ్యాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్ కూడా ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే తన విమానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. గ్లోబల్ ఫ్లైట్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లైట్‌రాడార్24 ప్రకారం, గురువారం పాకిస్తాన్, భారత్‌కు పశ్చిమ ప్రాంతం, కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు విమానిక ప్రదేశంలో ఒక్క విమానం కూడా కనిపించడంలేదు.

Next Story