Tahawwur Rana: ముంబై ఉగ్రదాడి కేసులో సూత్రధారి తహవూర్ రాణా కస్టడీ పొడిగింపు

by Shamantha N |

ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవూర్‌ హుస్సేన్‌ రాణా (Tahawwur Rana)కు ఎన్ఐఏ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Tahawwur Rana: ముంబై ఉగ్రదాడి కేసులో సూత్రధారి తహవూర్ రాణా కస్టడీ పొడిగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవూర్‌ హుస్సేన్‌ రాణా (Tahawwur Rana)కు ఎన్ఐఏ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో, మరో 12 రోజులు అతడు దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉండనున్నాడు. ఇదివరకు విధించిన 18 రోజుల కస్టడీ గడువు ముగియడంతో సోమవారం రాణాను కోర్టుముందు హాజరుపర్చారు. అతడి ముఖం కనిపించకుండా కవర్ చేసి, కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయస్థానానికి తీసుకువచ్చారు. కాగా.. ఎన్‌ఐఏ అదుపులో ఉన్న రాణాను ఇటీవలే ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు విచారించారు. ఈ విచారణకు అతడు సహకరించకుండా.. తప్పించుకునే రీతిలో సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ముంబై ఉగ్రదాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో భాగంగా రాణా వెల్లడించినట్లు సమాచారం.

కెనడా జాతీయుడు..

తహవూర్‌ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. కాగా.. 26/11 ముంబై దాడుల్లో అతడు కీలక సూత్రధారి. ఉగ్ర కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ.. ముంబైలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు తెలుస్తోంది. ముంబై ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్‌ తయారీలో రాణా హస్తం ఉంది. రాణా, హెడ్లీపై ఉగ్ర దాడులు, కుట్ర కేసులు నమోదు చేశారు. 26/11 దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. అమెరికా జైల్లో శిక్ష అనుభవించిన అతడిని అప్పగింత ప్రక్రియలో భాగంగా భారత్‌కు తీసుకువచ్చారు. కాగా.. అతడు ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు.

Next Story