Tahawwur Rana: ప్రత్యేక విమానంలో భారత్ రానున్న తహవూర్ రాణా

by Shamantha N |

ముంబై ఉగ్రదాడి(Mumbai terror attacks) కేసులో కీలక నిందితుడు తహవూర్ రాణాను(Tahawwur Rana) భారత్ కు అప్పగించారు.

Tahawwur Rana: ప్రత్యేక విమానంలో భారత్ రానున్న తహవూర్ రాణా
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై ఉగ్రదాడి(Mumbai terror attacks) కేసులో కీలక నిందితుడు తహవూర్ రాణాను(Tahawwur Rana) భారత్ కు అప్పగించారు. అమెరికాలో ఉన్న చట్టపరమైన ప్రక్రియ పూర్తియిన తర్వాత అతడ్ని భారతీయ అధికార బృందానికి అప్పగించారు. ప్రస్తుతం అతడ్ని ఎన్ఐఏ అధికారుల బృందం అమెరికాలో భారత్ కు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున ఆ విమానం భారత్ చేరుకోనున్నట్లు సమాచారం. భారత్‌కు అప్పగించొద్దంటూ అమెరికా (USA) సుప్రీంకోర్టును తహవూర్‌ రాణా ఇటీవలే ఆశ్రయించాడు. తనను భారత్ కు అప్పగించవద్దని కోరాడు. అప్పగింతను(Extradition) వెంటనే నిలిపివేయాలని రాణా యూఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. భారత్‌కు పంపిస్తే అక్కడ చిత్రహింసలకు గురిచేస్తారని ఆరోపించాడు. దీనిపై విచారణ జరగ్గా.. రాణా పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అక్కడి న్యాయస్థానం పేర్కొంది. దీంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే భారత అధికారుల బృందం వాషింగ్టన్ కు వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసింది. ఆ తర్వాత అతడిని అమెరికా అధికారులు భారత్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.

ముంబై దాడుల్లో కీలక సూత్రధారి

తహవూర్‌ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. కాగా.. 26/11 ముంబై దాడుల్లో అతడు కీలక సూత్రధారి. ఉగ్ర కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ.. ముంబైలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు తెలుస్తోంది. ముంబై ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్‌ తయారీలో రాణా హస్తం ఉంది. రాణా, హెడ్లీపై ఉగ్ర దాడులు, కుట్ర కేసులు నమోదు చేశారు. 26/11 దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం, రాణా లాస్‌ ఏంజెలెస్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలంటూ చాలాకాలంగా భారత్‌ పోరాడుతోంది. దీన్ని సవాల్‌ చేస్తూ తహవూర్‌ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా.. ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్‌లోనూ అతడికి నిరాశే మిగిలింది. దీంతో అతడు గతేడాది నవంబరు 13న అమెరికా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాడు. దాన్ని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం కోర్టుకు 20 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ ని పరిశీలించిన సుప్రీంకోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఇటీవల రాణా అప్పగింతపై ట్రంప్ కూడా ప్రకటన చేశారు.

Next Story