UPIతో 25 శాతం అధిక ఖర్చు.. తెలియకుండానే జేబుకు చిల్లు అనిపిస్తోందా.. అసలు నిజాలివే

by Prasad Jukanti |   (  Updated:2026-04-15 13:07:42  IST  )

యూపీఐ రాక చెల్లింపుల విధానాన్ని పూర్తిగా మార్చివేయడంతో పాటు మనం ఖర్చుచేసే పద్ధతులను సైతం సమూలంగా మర్చివేసింది.

UPIతో 25 శాతం అధిక ఖర్చు..  తెలియకుండానే జేబుకు చిల్లు అనిపిస్తోందా.. అసలు నిజాలివే
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకువచ్చిన యూపీఐ మన చెల్లింపుల విధానాన్ని (UPI Spending Habits) ఎంత వేగవంతం చేసిందో మన ఖర్చు చేసే అలవాట్లను సైతం అంతే సమూలంగా మార్చేసింది. యూపీఐ రాకతో చెల్లింపులు సులభతరం అయ్యాయని సంతోషించేలోపు మనకు తెలియకుండానే బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అవుతోందని మనలో చాలా మంది ఆలోచనలో పడుతున్నారు. దీంతో యూపీఐ వినియోగించాలా వద్దా అని కొందరు వెనకడుగు వేయాలని చూస్తున్నా చిల్లర సమస్యతో చివరకు వాడక తప్పడం లేదని చాలా మంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ వినియోగం విషయంలో నిపుణులు చెబుతున్న విషయాలు షాకింగ్‍గా మారాయి.

నో పెయిన్ ఆఫ్ పెయింగ్:

ఒకప్పుడు ఏదైనా కొనాలంటే వెంట నగదు తీసుకు వెళ్లాల్సి ఉండేది. షాపింగ్‍కు వెళ్తే చేతిలో ఉన్న డబ్బును అంచనా వేసుకుంటూ పరిమితి మేరకు ఖర్చు చేసేవారు. మన బ్యాంకులో ఉన్న నగదు మన చేతిలో లేకపోవడం కూడా ఓ కారణం. కానీ ఇప్పుడు యూపీఐ రూపంలో జస్ట్ స్కాన్.. పే.. ఫినిష్ అన్నట్లు క్షణాల్లో లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఎన్ని బ్యాంకులు ఉంటే అన్ని బ్యాంకుల్లోని బ్యాలెన్స్ అంతా మన వెంటే ఉన్నట్లు అనిపిస్తోంది. దీంతో ఒక వస్తువుకోసం వెళ్లిన వారు అదనపు వస్తువులను కూడా వెంట తీసుకొచ్చుకునేలా టెంప్ట్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితి కేవలం నగరాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకింది. నగదు రూపంలో ఖర్చు చేసినప్పుడు డబ్బు చేతి నుంచి వెళ్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. దీనిని నిపుణులు 'Pain of Paying' అంటారు. కానీ డిజిటల్ పేమెంట్స్‌లో ఆ ఫీలింగ్ కలగదు. దీనివల్ల ప్రజలు నగదు కంటే డిజిటల్ రూపంలో 15 నుంచి 25 శాతం ఎక్కువ ఖర్చు చేస్తున్నారని అధ్యయనాలు వెల్లడించాయని నిపుణులు చెబుతున్నారు.

క్రెడిట్ కార్డుల రాకతో అడిషనల్:

ఇప్పుడు రూపే (RuPay) క్రెడిట్ కార్డులను యూపీఐకి లింక్ చేసే సదుపాయం రావడంతో ప్రజల కొనుగోళ్ల విషయంలో పెను మార్పులకు కారణం అవుతోంది. బ్యాంక్ బ్యాలెన్స్‌తో సంబంధం లేకుండా అప్పు (Credit) మీద ఖర్చు చేసే అవకాశం పెరిగింది. ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద వస్తువులకే క్రెడిట్ కార్డులు వాడేవారు కూడా ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డు యూపీఐ లింక్ సౌకర్యంతో రూ. 10 టీ నుంచి రూ. 200 నిత్యావసరాల వరకు క్రెడిట్ మీదే స్కాన్ చేస్తున్నారు. ఇది మధ్యతరగతి కుటుంబాల పొదుపుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఖర్చుల నియంత్రణకు ఈ టిప్స్ పాటించండి:

యూపీఐ వల్ల ఖర్చులు పెరుగుతున్నా వాటిని ట్రాక్ చేయడం కూడా అంతే సులభం. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. యూపీఐ ఖర్చుల కోసం మాత్రమే ఒక ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ మెయింటెన్ చేయాలని సూచిస్తున్నారు. మీ ఆదాయంలో కేవలం 20 శాతం మాత్రమే ఈ ప్రత్యేక ఖాతాలో వేసి ఆ నిల్వలు అయిపోతే ఖర్చులు తగ్గించుకునేలా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. ఇక వారానికి కనీసం 10 నిమిషాలు మీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ హిస్టరీని చూసుకోవాలని దీనివల్ల మీరు ఎక్కడ అనవసరంగా ఖర్చు చేస్తున్నారో అర్థమవుతుందని సూచిస్తున్నారు. అలాగే మీ యూపీఐ యాప్‌లో రోజువారీ లావాదేవీల పరిమితిని (Transaction Limit) సెట్ చేసుకోవడం కూడా ఆర్థిక పరమైన లిమిట్స్ దాటకుండా నిలువరించుకోగలుగుతామని చెబుతున్నారు. మొత్తంగాయూపీఐ రాక సౌకర్యంతో పాటు ఖర్చులను అడ్డుకట్ట వేసుకోలేని పరిస్థితికి తీసుకువెళ్తున్న తరుణంలో సెల్ఫ్ రిస్ట్రిక్చన్ అత్యంత ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story