మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు

by Muthe.Rajitha |

అగ్రనేతలతోపాటు వందలాది మావోయిస్టులు లొంగిపోతూ గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.

మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
X

దిశ, వెబ్ డెస్క్ : అగ్రనేతలతోపాటు వందలాది మావోయిస్టులు లొంగిపోతూ గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని కాంకర్ జిల్లాలో ఆదివారం మరోసారి పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 21 మంది లొంగిపోయిన మావోయిస్టుల్లో.. 13 మంది మహిళలు ఉన్నారు. వీరంతా కేశ్కల్ డివిజన్ (నార్త్ సబ్-జోనల్ బ్యూరో) క్యాడరుకు చెందిన వారు.

వీరి వద్ద ఉన్న మూడు AK-47 రైఫిల్స్, నాలుగు SLRలు, రెండు INSAS రైఫిల్స్, ఆరు .303 రైఫిల్స్, రెండు సింగిల్-షాట్ రైఫిల్స్, ఒక BGL లాంచర్‌తోసహా 18 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. బస్తర్ రేంజ్ సీనియర్ పోలీస్ అధికారుల సమక్షంలో ఈ లొంగుబాటు జరిగింది. ఈ బృందంలో డివిజన్ కమిటీ సెక్రటరీ ముకేశ్‌తో సహా నలుగురు డివిజన్ కమిటీ సభ్యులు(DVCMs), తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు(ACMs), ఎనిమిదిమంది పార్టీ సభ్యులు ఉన్నారు.

కాగా ఇటీవలే జగదల్‌పూర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు రూపేష్‌తో సహా 210 మంది మావోయిస్టులు 153 ఆయుధాలతో లొంగిపోయిన తర్వాత, మరో భారీ లొంగుబాటు జరగడం విశేషం. ఆపరేషన్ కగర్ లో భాగంగా 2026 మార్చి నాటికి మొత్తం బస్తర్ ప్రాంతాన్ని మావోయిస్టు-రహితంగా చేయాలనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నట్టు పేర్కొన్నారు. గత రెండేళ్లలో ఛత్తీస్‌గఢ్‌లో రికార్డు స్థాయిలో లొంగుబాట్లు జరిగాయి. 2023 డిసెంబర్ నుండి ఇప్పటివరకు 2,100 మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టడం గమనార్హం.

Next Story