48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు మృతి చెందే అవకాశం: యూఎన్‌ హెచ్చరిక

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-20 12:03:58  IST  )

ఇజ్రాయెల్ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న గాజా(Israel - Gaza War)లో 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు మరణించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి (United Nations) హెచ్చరించింది.

48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు మృతి చెందే అవకాశం: యూఎన్‌ హెచ్చరిక
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఇజ్రాయెల్ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న గాజా(Israel - Gaza War)లో 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు మరణించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి (United Nations) హెచ్చరించింది. యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతంలో మరింత సహాయం అందకపోతే భారీ సంఖ్యలో శిశువులు చనిపోతారని తెలిపింది. 11 వారాలపాటు గాజాను పూర్తిగా నిర్బంధించిన తర్వాత ఇజ్రాయెల్ అధికారులు పాలస్తీనా భూభాగంలోకి పరిమిత సహాయాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు.

ఈ విషయంపై యూఎన్ హ్యూమానిటేరియన్ చీఫ్ టామ్ ఫ్లెచర్ (Tom Fletcher) మాట్లాడుతూ.. సోమవారం నాడు కేవలం ఐదు ట్రక్కుల సహాయ సామాగ్రి, శిశువుల కోసం ఆహారంతో సహా గాజాలోకి ప్రవేశించాయి కానీ.. అది సముద్రంలో ఒక చుక్క నీటితో సమానమన్నారు. ఈ సహాయం ఇంకా అవసరమైన సమాజాలకు చేరలేదని ఆయన తెలిపారు. రాబోయే 48 గంటల్లో 14,000 శిశువులు మరణిస్తారు. మేము వారికి సహాయం చేయకపోతే పోషకాహార లోపంతో బాధపడుతున్న తల్లులు తమ పిల్లలకు ఆహారం ఇవ్వలేకపోతున్నారని పేర్కొన్నారు.

బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నాయకులు సోమవారం ఇజ్రాయెల్ తీవ్రమైన చర్యలను ఖండిస్తూ.. మానవతా సహాయంపై నిరోధకాలను ఆపకపోతే ఉమ్మడి చర్య తీసుకుంటామని హెచ్చరించారు. బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer), ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron), కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) ఉమ్మడి ప్రకటనలో ఇజ్రాయెల్ సహాయాన్ని అడ్డుకోవడం, నెతన్యాహు (Benjimin Netanyahu) ప్రభుత్వంలోని మంత్రులు పాలస్తీనియన్ల భారీ స్థానభ్రంశం గురించి బెదిరింపు వ్యాఖ్యలను ఖండించారు. ఫ్లెచర్ ఈ మూడు దేశాల చర్యను గట్టి మాటలుగా అభివర్ణించి, అంతర్జాతీయ స్థానం బలపడినందుకు స్వాగతించారు. ఈ రోజు మరో 100 ట్రక్కుల సహాయం, శిశు ఆహారం, పోషకాహారంతో, గాజాలోకి చేరాలని యూఎన్ ఆశిస్తోందని ఆయన తెలిపారు. రానున్న 48 గంటల్లో వీలైనంతమంది శిశువుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తామన్నారు.

14,000 శిశువులు ఆకలి ప్రమాదంలో ఉన్నారని యూఎన్ ఎలా నిర్ధారించిందని అంతర్జాతీయ మీడియా ప్రశ్నించినపుడు.. ఫ్లెచర్ మాట్లాడుతూ.. యూఎన్ బృందాలు వైద్య కేంద్రాలు, పాఠశాలల వంటి ప్రాంతాల్లో అవసరాలను అంచనా వేస్తున్నాయని తెలిపారు. మా బృందాలు గాజాలోని వైద్య కేంద్రాలు, పాఠశాలల్లో ఉన్నాయి. చాలా మంది సభ్యులు హత్యకు గురయ్యారు. కానీ ఇంకా చాలా మంది అక్కడే ఉంటూ అవసరాలను అంచనా వేస్తున్నారు అని ఆయన అన్నారు. గాజాలో సంభవించే కరవు ప్రమాదంపై అంతర్జాతీయ ఒత్తిడి నడుమ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం రాత్రి 11 వారాల సహాయ నిరోధాన్ని కొంతవరకు సడలించారు. డిప్లొమాటిక్ కారణాల కోసం గాజాలో ఆకలి సంక్షోభాన్ని నివారించడానికి కనీస స్థాయిలో సహాయం అనుమతించడం అవసరమని ఆయన పేర్కొన్నారు.

Next Story