Kharge: ప్రధాని మోడీ 151 విదేశీ పర్యటనలపై ఖర్గె విమర్శలు

by S Gopi |

దౌత్యపరమైన విజయాల కంటే ఫోటోలు తీసుకోవడంపైనే ప్రధాని మోడీ విదేశీ పర్యటనల్లో ఎక్కువ దృష్టి సారించినట్టు ఆరోపించారు.

Kharge: ప్రధాని మోడీ 151 విదేశీ పర్యటనలపై ఖర్గె విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాంగ విధానాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె విమర్శలు చేశారు. తరచుగా అంతర్జాతీయ పర్యటనలకు వెళ్లడంపై ఆయన ప్రశ్నలు గుప్పించారు. గడిచిన 11 ఏళ్లలో ప్రధాని మోడీ 151 విదేశీ పర్యటనలు చేశారు. వీటిలో అమెరికాకు వెళ్లిన 10 పర్యటనలతో సహా మొత్తం 72 దేశాలకు మోడీ వెళ్లారు. అయినప్పటికీ గ్లోబల్ ఫ్లాట్‌ఫామ్‌పై భారత్ ఒంటరిగానే కనిపిస్తోంది. ఈ పర్యటనలు దేశానికి ప్రపంచ స్థాయిలో ఫలితాలను ఇచ్చాయా అనేది ప్రశ్నగానే మిగిలింది. దౌత్యపరమైన విజయాల కంటే ఫోటోలు తీసుకోవడంపైనే ప్రధాని మోడీ ఈ విదేశీ పర్యటనల్లో ఎక్కువ దృష్టి సారించినట్టు కనిపించారని ఆయన ఆరోపించారు. ఫోటోలకు పోజులివ్వడం మాత్రమే ప్రధానమంత్రి పనా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థం(ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కు 1.4 బిలియన్ డాలర్ల రుణమివ్వడం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యల సమయంలో అకస్మాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించడం స్వారా భారత్ ప్రభావం తగ్గుతుందనడానికి ఉదాహరణలని ఖర్గె ప్రస్తావించారు. మరోవైపు, కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలపై కూడా ప్రధాని మోడీ ఏమీ మాట్లాడకపోవడంపై ఖర్గె విమర్శించారు. ఇది భారత విదేశాంగ విధానంలో స్పష్టత, పారదర్శకత లేకపోవడాన్ని సూచిస్తుందన్నారు. పెహల్గాం ఘటనకు సంబంధించి భద్రతాపరమైన ముప్పు గురించి తెలిసినప్పటికీ, పర్యాటకులకు తగిన భద్రతా ఏర్పాట్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఖర్గే పేర్కొన్నారు.

Next Story