Tamil Nadu: రాజ్యాంగ చరిత్రలోనే తొలిసారిగా.. తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం

by Shamantha N |

రాజ్యాంగ చరిత్రలోనే తొలిసారిగా తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే స్టాలిన్ సర్కారు 10 చట్టాలను(Tamil Nadu notifies 10 Acts) నోటిఫై చేసింది.

Tamil Nadu: రాజ్యాంగ చరిత్రలోనే తొలిసారిగా.. తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగ చరిత్రలోనే తొలిసారిగా తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే స్టాలిన్ సర్కారు 10 చట్టాలను(Tamil Nadu notifies 10 Acts) నోటిఫై చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించిన వెటనే తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 11న ఆ రాష్ట్ర గెజిట్‌లో పది చట్టాలను అధికారికంగా నోటిఫై చేసింది. ఈ చట్టాలను గతంలో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. అయితే గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోదం తెలుపకపోవడంతో ప్రత్యేక సమావేశంలో వాటిని తిరిగి ఆమోదించారు. ఆ తర్వాత రాష్ట్రపతికి పంపారు. తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టాలు (రెండవ సవరణ) 2022, తమిళనాడు ఫిషరీస్ యూనివర్శిటీ (సవరణ) చట్టం 2020 (గతంలో తమిళనాడు డాక్టర్ జే జయలలిత ఫిషరీస్ యూనివర్సిటీగా ఉన్న పేరు మార్పు), ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారాన్ని గవర్నర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు వంటి చట్టాలను... గవర్నర్‌, రాష్ట్రపతి అనుమతి లేకుండానే ప్రభుత్వ గెజిట్‌లో నోటిఫై చేశారు. ఈ సందర్భంగా డీఎంకే అంటే చరిత్రను సృష్టించడం అని సీఎం ఎంకే స్టాలిన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

సుప్రీం కోర్టు తీర్పు

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి పంపగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తనవద్దే ఉంచేసుకుంటున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లుల్ని సమ్మతించకపోవడం, పరిశీలించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని తెలిపింది. రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలోను ఆయన తీరు మార లేదంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై ఇటీవల సుప్రీం తీర్పు వెలువరించింది. తమిళనాడు గవర్నర్ చర్యను రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం ఆపితే అందుకు తీసుకోవాల్సిన అత్యధిక గడువు నెల మాత్రమే అని తీర్పు వెలువరించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని మంగళవారం పేర్కొంది. గవర్నర్‌ ఈ కాల నిర్దేశాన్ని పాటించనిపక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రి మండలి సలహా మేరకు తప్పనిసరిగా పనిచేయాలి కానీ.. గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదంది.

ప్రాసెస్ ఏంటంటే..?

కాగా, భారత రాజ్యాంగం ప్రకారం సాధారణంగా ఒక బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత గవర్నర్‌కు పంపుతారు. గవర్నర్‌ ఆమోదిస్తే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. అలాగే గవర్నర్ తన సమ్మతిని నిలిపివేయవచ్చు. పరిశీలన కోసం బిల్లును ప్రభుత్వానికి తిరిగి పంపవచ్చు. లేదా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయవచ్చు. అయితే తిరిగి వచ్చిన బిల్లును మార్పులతో లేదా మార్పులు లేకుండా మళ్లీ శాసనసభ ఆమోదించినట్లయితే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాలి. దాన్ని మళ్లీ రిజర్వ్ చేయలేరు. హైకోర్టు లేదా కేంద్రం పరిధిలోని అంశాలను ప్రభావితం చేసే బిల్లు మాత్రం తప్పనిసరిగా రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లాలి.

Next Story