- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
US-Iran War: యుద్ధంలో అగ్రరాజ్యానికి ప్రతిరోజూ ఒక బిలియన్ డాలర్ల ఖర్చు
ఇందులో కేవలం మొదటి ఆరు రోజుల్లోనే సుమారు 11.3 బిలియన్ డాలర్లు(రూ. 1,06,751) ఖర్చు కాగా, రోజుకు దాదాపు 1 బిలియన్ డాలర్ల(రూ. 9,447) చొప్పున ఖర్చు అవుతోంది

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు అగ్రరాజ్యం అమెరికాకు కోలుకోలేని ఆర్థిక దెబ్బ తీస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధానికి దిగిన అమెరికాకు జరిగే ఆర్థిక, మానవ నష్టం రోజురోజుకు పెరుగుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇప్పటికే పదుల బిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయి. ఇరాన్ కాస్ట్ టిక్కర్ ట్రాక్ చేసిన డేటా ప్రకారం, దాడులు ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా 35 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 3,30,645 కోట్లు) దాటింది. ఇందులో కేవలం మొదటి ఆరు రోజుల్లోనే సుమారు 11.3 బిలియన్ డాలర్లు(రూ. 1,06,751) ఖర్చు కాగా, రోజుకు దాదాపు 1 బిలియన్ డాలర్ల(రూ. 9,447) చొప్పున ఖర్చు అవుతోంది. దీన్ని బట్టి ప్రతి సెకనుకు కోట్లలోనే ఖర్చవుతున్నాయని అర్థం.
రోజూవారీగా జరిగే ఖర్చులు కాకుండా, అమెరికా సైనిక ఆస్తులకు గణనీయమైన నష్టం వాటిల్లింది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, మధ్యప్రాచ్యం అంతటా అమెరికా, దాని మిత్రదేశాల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల కారణంగా, మొదటి మూడు వారాల్లోనే 1.4 బిలియన్ డాలర్ల(రూ. 13,226 కోట్ల) నుంచి 2.9 బిలియన్ డాలర్ల(రూ. 27,396 కోట్ల) మధ్య నష్టాలు, మరమ్మతు ఖర్చులు జరుగుతున్నాయి.
ఈ వ్యయంలో అధిక భాగం విలువైన పరికరాల నష్టాల వల్లే ఏర్పడింది. ఒక్కోటి దాదాపు 100 మిలియన్ డాలర్ల(రూ. 945 కోట్ల) విలువైన మూడు ఎఫ్-15ఈ యుద్ధ విమానాలు కూలిపోయాయి. గగనతలంలో ఇంధనం నింపే విమానాలు కూడా దెబ్బతిన్నాయి. ఒక ఇంధన విమానం ఢీకొని కూలిపోగా, ఇతర విమానాలు క్షిపణుల దాడిలో దెబ్బతిన్నాయి.
డ్రోన్‌లు, ఇతర రిమోట్-కంట్రోల్డ్ యంత్రాలు కూడా ధ్వంసమయ్యాయి, కొన్ని దెబ్బతిన్నాయి. కొత్త వేరియంట్ ఒక్కొక్కటి 30 మిలియన్ డాలర్ల(రూ. 283 కోట్ల) వరకు ఖరీదైన డజనుకు పైగా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌లు ధ్వంసమయ్యాయి. యుద్ధ ప్రాంతంలో జరిగిన దాడులలో కీలకమైన రాడార్, క్షిపణి రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. వీటిలో కొన్నింటి విలువ వందల మిలియన్లు లేదా 1 బిలియన్ డాలర్లు కూడా ఉంటుంది. ఇక, మానవ నష్టం కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు కనీసం 13 మంది అమెరికా సైనికులు మరణించగా, 200 మంది గాయపడ్డారు.






