భూమి సమీపంలోకి మరో ప్రమాదకరమైన ఆస్టరాయిడ్!

122

దిశ, ఫీచర్స్ : గత నెల 21న ‘2001 F032’ ఆస్టరాయిడ్ భూమికి అతి సమీపంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరో ఉల్క.. భూమి వైపునకు దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ వెల్లడించింది. ఇప్పటి వరకు భూమి వైపుగా దూసుకొచ్చిన గ్రహ శకలాలన్నింటి కంటే వేగంగా.. అంటే సెకనుకు 9 కిలోమీటర్ల వేగంతో ఈ ఆస్టరాయిడ్ ప్రయాణిస్తోందని నాసా పేర్కొంది. కాగా ఈ గ్రహశకలం ఓ ఫుట్‌బాల్‌ మైదానమంత పరిమాణంలో ఉంటుందని, వచ్చే నెల 4న భూమికి దగ్గర నుంచి వెళ్తుందని వివరించిన నాసా.. దీని వ్యాసార్థం 260 నుంచి 580 మీటర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.

నాసా ఈ గ్రహశకలానికి ‘2021 ఏఎఫ్‌-8’గా నామకరణం చేసింది. ఇప్పటి వరకు భూమి వైపు వచ్చిన గ్రహశకలాలన్నిటిలో ఇది చిన్నదైనప్పటికీ, అది కదులుతున్న వేగం ఆధారంగా ప్రమాదకరమైనదిగా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే భూమికి సుమారు 3.4 మిలియన్‌ కిలోమీటర్ల దూరం నుంచే ఈ ఉల్క వెళ్తుందని, తద్వారా భూమికి ప్రమాదమేమీ ఉండదని మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఈ ఉల్కలు భూమి కక్ష్యను పూర్తి చేసుకుని, సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తాయని అంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి గ్రహశకలాలను 22 వరకు గుర్తించినట్లు వివరించారు. రాబోయే వందేళ్లలో వీటిల్లో ఏదైనా భూమిని ఢీకొట్టే అవకాశముందని భావిస్తుండగా.. అతిపెద్ద ఆస్టరాయిడ్ ‘29075’ (1950డీఏ) 2880లో భూమిని ఢీ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు. ఇది అమెరికాలోని ఎంపైర్‌ స్టేట్ భవనం కంటే మూడు రెట్లు పెద్దదిగా ఉండొచ్చని చెప్తున్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..