మా జోలికొస్తే తోలు తీస్తాం.. వైసీపీకి నారా లోకేష్ హెచ్చరిక

by  |
మా జోలికొస్తే తోలు తీస్తాం.. వైసీపీకి నారా లోకేష్ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సైకోరెడ్డి పాలన నడుస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి సంతోషిస్తారని.. కానీ ఏపీసీఎం జగన్ మాత్రం టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలపై దాడులు చేసి ఆనందిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని లక్కరాజుపల్లెలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఘర్షణలో మృతి చెందిన గరికపాటి కృష్ణారావు కుటుంబాన్ని నారా లోకేష్ బుధవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ బద్వేలులో సొంత పార్టీ ఎమ్మెల్యే చనిపోతే నవ్వుతూ ఆ కుటుంబాన్ని పరామర్శించారని విమర్శించారు. అందుకే జగన్ రెడ్డి పేరు సైకో రెడ్డి. రాష్ట్రంలో సైకోరెడ్డి పాలన నడుస్తోందని విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక గరికపాటి కృష్ణారావును దారుణంగా హత్య చేశారని ధ్వజమెత్తారు. కృష్ణారావు ప్రాణాలను కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దళిత అభ్యర్థిని సర్పంచిగా గెలిపించామన్న కక్షతో తమ పార్టీ నాయకున్ని రోడ్డుపైన దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. గతంలో అభివృద్ధి, సంక్షేమాల్లో ఇతర రాష్ట్రాలతో పోటీ పడేవాళ్లం. కానీ నేడు దాడులు, హత్యలు, ఫ్యాక్షన్ రాజకీయాలతో బీహార్‌తో పోటీపడుతున్నామని ఆరోపించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వం అని అంబటి రాంబాబు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. త్వరలో ప్రజలే వైసీపీ నేతలను తరిమికొట్టే రోజు వస్తోందని హెచ్చరించారు. 151 మంది గెలిచాం.. ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు. దురాలోచనతో ఉన్నా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. మళ్లీ చెప్తున్నా.. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తామని హెచ్చరించారు.

బడుగు, బలహీన వర్గాలు రాజకీయాల్లోకి రాకూడదా? దళిత మహిళ సర్పంచ్ గా గెలిస్తే మీకెందుకంత కడుపుమంట.? మా కార్యకర్తల జోలికొస్తే తోలుతీస్తాం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 25 మంది కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. ప్రజలు కూడా ఆలోచించుకోవాలని మాజీమంత్రి నారా లోకేశ్ సూచించారు.


Next Story

Most Viewed