ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నయోమి ఒసాక

by  |
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నయోమి ఒసాక
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను జపాన్‌కు చెందిన వరల్డ్ నంబర్ 3 నయోమి ఒసాక గెలుచుకుంది. శనివారం మెల్‌బోర్న్‌లోని రాడ్ లెవర్ అరేనాలో అమెరికాకు చెందిన జెన్నిఫర్ బ్రాడీతో జరిగిన ఫైనల్‌లో 6-4, 6-3 తేడాతో విజయం సాధించింది. గత ఏడాది యూఎస్ సెమీస్‌తో తలపడిన వీరిద్దరే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ఆడుతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొన్నది. గంటా 17 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి ఒసాకా తన పవర్ గేమ్‌తో బ్రాడీపై ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి సెట్‌ను 6-4తో గెలిచిన తర్వాత రెండో సెట్‌లో వరుసగా మూడు గేమ్స్ గెలుచుకున్నది. అయితే బ్రాడీ అప్పుడు పోరాటం మొదలు పెట్టినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరకు రెండో సెట్ 6-3తో గెలుచుకొని ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించింది.

నయోమీ ఒసాకా ఈ విజయంతో నాలుగో గ్రాండ్ స్లామ్ తన ఖాతాలో వేసింది. రోజర్ ఫెదరర్, మోనిక సెలెస్ తర్వాత తమ తొలి నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు చేరి టైటిల్స్ గెలిచిన రికార్డును సమం చేసింది. 2018 యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో సెరేనాను ఓడించి తొలి సారిగా గ్రాండ్‌స్లామ్ గెలిచింది. 2019లో ఆస్ట్రేలియా ఓపెన్, 2020లో యూఎస్ ఓపెన్ గెలిచిన ఒసాకా.. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్నది. ఈ విజయంతో నయోమీ ఒసాకా వరల్డ్ మూడవ ర్యాంక్ నుంచి 2వ ర్యాంక్‌కు చేరుకున్నది. ‘ఈ విజయాన్ని పిజ్జా తింటూ యానీ చూస్తూ సెలెబ్రేట్ చేసుకుంటాను. నేను నా ప్రతీ టోర్నమెంట్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటాను. నేను చిన్నప్పుడు ఏ కల అయితే కన్నానో.. ఇప్పుడు అదే కలను నిజం చేసుకుంటున్నాను’ అని ఒసాకా చెప్పింది.

ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇలా గెలిచింది..

1వ రౌండ్ – ఏ. పవ్లుచెన్‌కోవా పై 6-1, 6-2
2వ రౌండ్ – సి. గ్రేసియాపై 6-2, 6-3
3వ రౌండ్ – ఓ. జబేర్‌పై 6-3, 6-2
4వ రౌండ్ – జి. ముగురుజపై 4-6, 6-4, 7-5
క్వార్టర్ ఫైనల్ – ఎస్. హేయ్‌పై 6-2, 6-2
సెమీఫైనల్ – సెరేనా విలియమ్స్‌పై 6-3, 6-4
ఫైనల్ – జెన్నిఫర్ బ్రాడీపై 6-4, 6-3


Next Story

Most Viewed