‘కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకే దుబ్బాక ఎన్నికలు’

13

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారాలు పుంజుకున్నాయి. ఎవరికి వారు దూసుకుపోతూ… ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా గురువారం దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రాన్ని మోసం చేసిన సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకే దుబ్బాకలో ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. దుబ్బాక ఎన్నిక రాష్ట్రంలో మార్పునకు శ్రీకారమన్నారు.

అనంతరం ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం కోసం 11 వందల మంది పిల్లలు ఆత్మత్యాగాలు చేశారని, ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ తుంగలో తొక్కిందని  దుయ్యబట్టారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక అభివృద్ధి ముత్యంరెడ్డి హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు.