ఎవ్వరికీ మెజార్టీ రాకపోతే.. ఏం చేస్తారో తెలుసా..?

by  |
ఎవ్వరికీ మెజార్టీ రాకపోతే.. ఏం చేస్తారో తెలుసా..?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ:నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవ్వరికీ స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. దీంతో ఎన్నికల అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు. ఇందులో ఇప్పటి వరకు 66 మంది ఎలిమినేట్ అయ్యారు. ప్రధాన పోటీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరామ్ ఉండనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్ ఎలిమినేషన్ కొనసాగుతుండగా.. ఇంకా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ కావాల్సి ఉంది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో కోదండరామ్ రెండో స్థానానికి చేరుకోకపోతే.. ఆయన సైతం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

అదే సమయంలో తీన్మార్ మల్లన్న రెండో స్థానాన్ని నిలబెట్టుకోకపోతే.. ఆయన ఎలిమినేట్ అవుతారు. కానీ మల్లన్నకు సైతం రెండో ప్రాధాన్యత ఓట్లు చెప్పుకోదగిన విధంగా వస్తున్నాయనే చెప్పాలి. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డికి 65,781 ఓట్లు అవసరం కాగా, తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు, కోదండరామ్‌కు 1,04,057 ఓట్లు కావాల్సి ఉంది. ఇదిలావుంటే.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఏ అభ్యర్థి గెలుపు కోటా(1,83,167 ఓట్లు) చేరుకోకపోతే.. పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అందుకోసం ఎన్నికల అధికారులు ఇప్పటికే సంబంధిత కసరత్తు చేశారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు పూర్తయిన పక్షంలోనూ ప్రధాన పోటీలోని ఏ అభ్యర్థికి గెలుపు కోటా ఓట్లు సాధించకపోతే.. ఎవ్వరికీ ఎక్కువ మెజార్టీ ఉంటే.. వారినే విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే 2015 ఎన్నికల్లోనూ ఇదే తరహలో ఏ అభ్యర్థికి కోటా ఓట్లు రాకపోవడంతో మెజార్టీ ఓట్లు ఉన్న అభ్యర్థి గెలుపొందినట్టు ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో ఆ అవకాశం పల్లా రాజేశ్వర్ రెడ్డికి గానీ తీన్మార్ మల్లన్నకు గానీ ఉండే అవకాశం ఉంది. ప్రొఫెసర్ కోదండరామ్‌కు రెండో ప్రాధాన్యత ఓట్లు వస్తే.. ఆయనకు అవకాశం లేకపోలేదు.



Next Story