ఇంకా బిగించని మూసీ గేటు.. ఈసారి పంటలు కష్టమే

by  |
ఇంకా బిగించని మూసీ గేటు.. ఈసారి పంటలు కష్టమే
X

దిశ , నల్లగొండ: నల్లగొండ జిల్లాలో నాగార్జున‌సాగర్ తర్వాత మరో పెద్దది మూసీ ప్రాజెక్టు. దీని కింద ఈ ఏడాది వానాకాలం పంటలు సాగవ్వడం కష్టంగా మారేలా ఉంది. గతేడాది అక్టోబర్ నెలలో ప్రాజెక్టులోని 5వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గేటు బిగించలేదు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో గేటు లేకపోవడం వల్ల ప్రాజెక్టులోని నీరు కృష్ణానదిలోకి చేరుతోంది. గేటు పనులు జరుగుతున్నా పూర్తి కావడానికి మరి కొంత సమయం పట్టనుండటంతో ప్రాజెక్టు కింద సాగయ్యే 30 వేల ఎకరాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది.

మూసీ ప్రాజెక్టు కింద ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత మరో పెద్ద ప్రాజెక్టు ఇదే. గతేడాది అక్టోబర్‌లో ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. కానీ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేటికీ ఆ గేటును బిగించలేదు. దీంతో ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండే పరిస్థితి లేదు. జూన్ నుంచే ప్రాజెక్టులోని నీరు రావడం మొదలైంది. కానీ ప్రాజెక్టుకు గేటు బిగించకపోవడం వల్ల ఆ నీరంత వృథాగా కృష్ణానదిలో కలుస్తోంది. ఇప్పటికే జూలై మాసం సగానికి పైగా గడిచిపోయింది. జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కానీ ఫలితం ఉండటం లేదు. గతేడాది అక్టోబరులో ప్రాజెక్టులోని ఐదో నంబరు గేటు కొట్టుకుపోయింది. దీంతో అప్పట్లోనే స్టాప్ లాగ్ గేటును అధికారులు ఏర్పాటు చేశారు. కానీ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సిన గేటు బిగింపు ఇటీవల కాలంలో ప్రారంభించారు. ఈ గేటు బిగించేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రాజెక్టు కింద సాగయ్యే పంటలకు నీరెలా అందుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

4.4 టీఎంసీల సామర్థ్యం..

ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం డెడ్ స్టోరీజీకి పడిపోయింది. ప్రధానంగా ఈ ప్రాజెక్టు నిండాలంటే ఎగువ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో వర్షాలు కురవాల్సి ఉంది. మూసీ ఎగువ ప్రాంతంతో పాటు హైదరాబాద్‌లోనూ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాస్తవానికి ప్రాజెక్టుకు 4.4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది. కానీ గేటు లేకపోవడంతో ప్రాజెక్టులోని వచ్చిన నీరు అలాగే కృష్ణానదిలోకి చేరుతోంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా మరమ్మతులు చేయలేదు.

ప్రశ్నార్థకంగా సాగు..

కేవలం ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీరు అందించాలని ఈ ప్రాజెక్టును నిర్మించారు. కానీ ఒక పంటకు సైతం ఈసారి సాగునీరు అందించని పరిస్థితి ఏర్పడింది. ఆరుతడి పంటలకు నీరు అందించాలంటే కనీసం మూడు సార్లు పంట తడవాల్సి ఉంటుంది. మూసీ ప్రాజెక్టు కింద కుడి, ఎడమ కాల్వలకు కలిపి 30వేల ఎకరాల ఆరుతడి పంటలకు సాగు‌నీరు అందించాల్సి ఉంది. కుడి కాల్వ పరిధిలో 14,770 ఎకరాలు, ఎడమ కాల్వ పరిధిలో 15,230 ఎకరాలు సాగులోకి రావాలి. గేటు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చినా.. తర్వాత భారీ వర్షాలు పడితే కానీ ప్రాజెక్టులోకి నీరు వచ్చే పరిస్థితి లేదు. అలా నీరు వచ్చి చేరితేనే సాగుకు నీరు అందించొచ్చు. ముందుగానే నిర్మాణం పూర్తి చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు అంటున్నారు.

పైనుంచి వరద నీరు..

వాస్తవానికి గేటు బిగింపు ప్రక్రియ చేపట్టాలంటే ప్రాజెక్టు నీటిమట్టం డెడ్ స్టోరీజీలో(610 అడుగుల కంటే తక్కువ) ఉండాల్సి ఉంది. అలా అయితేనే పనులు చేపట్టవచ్చు. దీని వల్ల హైదరాబాద్‌తో పాటు మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది. అలా చేరిన నీటిని గేట్ల బిగింపు ప్రక్రియ కోసం ఏడు, ఎనిమిది నెంబర్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తి పై నుంచి వచ్చిన నీటికి కిందకు యాథావిధిగా పంపిస్తున్నారు. ప్రాజెక్టు నిండే సమయంలో వరద నీరంతా వృథాగా కిందికి పోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed