సబర్మతి స్ఫూర్తితో మూసీ ప్రక్షాళన : ఎంపీ చామల కిరణ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2026-03-01 16:02:57  IST  )

సబర్మతి రివర్ పరివాహక ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మదర్ పాల డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డిలు సందర్శించారు.

సబర్మతి స్ఫూర్తితో మూసీ ప్రక్షాళన : ఎంపీ చామల కిరణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి రివర్ పరివాహక ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మదర్ పాల డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డిలు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గుజరాత్‌లో సబర్మతి రివర్ 22 కిలోమీటర్లు ప్రక్షాళన జరిగిందని, సబర్మతి రివర్ కు ఎస్టీపీల నుంచి నర్మదా నది నుంచి వచ్చే నీళ్లను పంటలకు పంపిస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో మూసీ ప్రక్షాళన చేసి గోదావరి నీళ్లను తెచ్చి మూసీలో కలపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని, సాగు, తాగు నీరు ఇవ్వాలనేది సీఎం సంకల్పమని ఎంపీ చామల చెప్పారు.

సబర్మతి రివర్‌కు మూసీకు సంబంధం లేదని తెలంగాణ చీఫ్ ​రామచందర్ రావు అంటున్నారని, సబర్మతి రివర్ ప్రక్షాళనకు 2004 నుంచి 2014 వరకు పది వేల కుటుంబాలను తరలించినట్లు అధికారులు చెప్పారని అన్నారు. కానీ ఎవరిని తరలించలేదని రామచందర్ రావు అబద్దాలు మాట్లాడుతున్నారని ఎంపీ చామల విమర్శించారు. మూసీ నదిని ప్రక్షాళనను చేసుకోవద్దా? ఆ మురికి కూపం లోనే బ్రతుకుదామా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేస్తే ఎప్పటికీ సీఎంగా ఉంటారని భయపడి బీఆర్ఎస్, బీజేపీలు వ్యతిరేకిస్తున్నారని ఆయన ఆరోపించారు. హరీశ్‌రావు, రామచందర్ రావులు సబర్మతి రివర్‌ను చూసి మాట్లాడాలని, ఇక్కడి అధికారులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు.

Next Story