దారుణం.. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.. దానికి ఒప్పుకోకపోవడంతో

147
murder

దిశ, ఏపీ బ్యూరో: ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. పెళ్లి కూడా చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కదా అని శారీరకంగా దగ్గరయ్యాడు. తీరా ప్రియురాలు గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోవాలని బలవంతం చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా కంబదూరు మండలం దేవరమాను క్రాస్ తిమ్మాపురం రోడ్డులోని ఉప్పరోని గుట్టపొదల్లో నవంబర్ 18న ఒక యువతి మృతదేహం లభించింది. ఆమెను కంబదూరుకు చెందిన నందిని(22)గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే పోస్టు మార్టంలో చనిపోయిన యువతిని గర్భిణీగా కంబదూరు పోలీసులు గుర్తించారు. పెళ్ళి కాకుండానే గర్భిణీ అయిందని తెలుసుకున్న పోలీసులు ఆమె ఫోన్‌ కాల్‌డేటాను పరిశీలించారు.

చివరిగా నరేశ్ అనే యువకుడితో మాట్లాడినట్లుగా గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. కనగానిపల్లి మండలం భానుకోటకు చెందిన నరేష్ కోసం పోలీసులు గాలించారు. పోలీసులు తనకోసం గాలిస్తున్నారని తెలుసుకున్న నరేశ్ తప్పించుకు తిరిగాడు. అయితే పోలీసులు విచారణ కోసం నరేశ్ తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న నరేశ్ వీఆర్వో వెంకటేశ్ ద్వారా కంబదూరు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు గల కారణాలను విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ‘ఇద్దరం ప్రేమించుకున్నాం. శారీరకంగా కలిశాం. ఆమె గర్భవతి అయ్యింది.

దీంతో అనేకమార్లు అబార్షన్ చేయించుకోమని బతిమాలాను. కానీ వినలేదు.. పెళ్ళి చేసుకోమని సతాయించింది. ఇంకా సెటిల్ అవ్వలేదు.. పెళ్ళి చేసుకోలేను అని తేల్చిచెప్పాను. అయినప్పటికీ ఆమె వినకపోవడంతో ఏం చేయాలో తెలియక నమ్మించి బయటకు తీసుకెళ్ళి చంపేసినట్లు’ పోలీసులకు నిందితుడు నరేశ్ వివరించాడు. దీంతో పోలీసులు నిందితుడు నరేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రేమించినోడి చేతిలో తమ కూతురు దారుణ హత్యకు గురైందని తెలుసుకున్న నందిని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.