‘ములుగు వెనకబడిన జిల్లా.. ఆ ఇబ్బంది రాకుండా దృష్టిపెట్టాలి’

by  |
‘ములుగు వెనకబడిన జిల్లా.. ఆ ఇబ్బంది రాకుండా దృష్టిపెట్టాలి’
X

దిశ, వరంగల్: రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచాలని ములుగు జల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులు, ఫర్టిలైజర్ కంపెనీల ప్రతినిధులతో ఎరువుల లభ్యతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువుల గోదాంలు వరంగల్‌లో ఉన్నందున రవాణా ఖర్చులు ఎక్కువై, ఎరువుల ధరలు రైతులు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందన్నారు. దీని దృష్ట్యా ములుగులో గోదాం ఏర్పాటుకు కంపెనీలు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కావాల్సిన ఎరువుల ఇండెంట్‌ను సమర్పించాలన్నారు. ఎరువుల కంపెనీలు మండలాల వారీగా గతేడాది ఏయే ఎరువులు ఎంత మేర అమ్మారో వివరాలు సమర్పించాలన్నారు. ప్రతి మండలంలో కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. అమ్మకంపై ప్రతి లావాదేవీలనూ పర్యవేక్షిస్తామన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 50 శాతం ఎరువులను కేటాయించాలన్నారు. డీలర్లు వందశాతం ఇ-పాస్ క్లియరెన్స్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కంపెనీలు జిల్లాలో డీలర్ షిప్‌లు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువుల కంపెనీలు, డీలర్లు, అధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పూర్తి వ్యాపార ధోరణితో కాకుండా రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ములుగు జిల్లా వెనుకబడిన ప్రాంతం కావడంతో, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


Next Story

Most Viewed