ధోనీ సలహాలతో నా బౌలింగ్ మెరుగయ్యింది : నటరాజన్

93

దిశ, స్పోర్ట్స్ : ఎంఎస్ ధోనీ యువ క్రికెటర్లకు పలు సలహాలు ఇస్తుంటాడు. టీమ్ ఇండియాలో ఆడుతున్న సమయం నుంచి ఇప్పుడు ఐపీఎల్ వరకు అతడు ప్రతి నిత్యం యువ క్రికెటర్లకు ఆటలోని మెలకువలు చెబుతుంటాడు. కేవలం తన జట్టులోని వారికే కాకుండా ఇతర జట్లలోని వారికి కూడా విలువైన సలహాలు ఇస్తుంటాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు టి. నటరాజన్ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఆ సీజన్ మొత్తంలో 71 యార్కర్లు విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతే కాకుండా కీలకమైన వికెట్లు తీసి జట్టుకు విజయాలు అందించాడు. నటరాజన్ తీసిన వికెట్లలో ధోనీ, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్లు కూడా ఉండటం విశేషం. అయితే తన బౌలింగ్ అంతలా మెరుగు పడటానికి ఎంఎస్ ధోనీ కారణమని నట్టూ చెబుతున్నాడు. ”సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఒక బంతిని ధోనీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత బంతికే ధోనీని అవుట్ చేశాను. కానీ ఆ సమయంలో ఎలాంటి సంబరాలు జరుపుకోలేదు. నేను మనసులోనే చాలా ఆనందించాను. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీతో మాట్లాడాను. ఆయన పలు విషయాలు చెప్పారు. చక్కగా బౌలింగ్ చేస్తున్నావని.. అనుభవంతో మరింత మెరుగు పడతావన్నారు. తక్కువ వేగంతో బౌన్సర్లు, కట్టర్లు వేస్తే మంచి ఫలితం ఉంటుందని ధోనీ చెప్పడంతో దాన్నే ఫాలో అయ్యాను. అందుకే అలాంటి బంతులు వేయగలిగాను” అని నటరాజన్ చెప్పుకొచ్చాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..