ఆర్థికవ్యవస్థ కోలుకునేదాకా ఆ రేట్లు యధాతథమే..?

by  |
ఆర్థికవ్యవస్థ కోలుకునేదాకా ఆ రేట్లు యధాతథమే..?
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ద్రవ్య విధాన సమీక్ష(ఎంపీసీ) ఈ వారంలో జరగనుంది. ధరల పెరుగుదల, పారిశ్రామిక రంగం పుంజుకోవడం లాంటి పరిణామాల నేపథ్యమ్ళో కీలక వడ్డీ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్‌బీఐ గతేడాది నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కీలక వడ్డీ రేట్లను చివరిసారిగా 2020, మేలో రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంతో అత్యల్పానికి తగ్గించింది. కొవిద్ ఆందోళన పరిస్థితుల మధ్య తర్వాత జరిగిన అన్ని సమావేశాల్లోనూ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది. ఈ వారంలో జరగనున్న సమీక్షా సమావేశంలో ఇప్పుడు పరిస్థితులను పరిగణలోకి తీసుకు కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు ఆర్‌బీఐ మొగ్గు చూపుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆగష్టు 4న(బుధవారం) ప్రారంభమవనున్న ఎంపీసీ సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. ఆగష్టు 6న వడ్డీ రేట్లతో పాటు ఇతర నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటిస్తారు.”గత కొంతకాలంగా ఆర్థికవ్యవస్థలో ద్రవ్యోల్బణం అంచనాలకు మించి ఉంది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పారిశ్రామికోత్పత్తి భారీగా పెరుగుతుందని ఆశించినప్పటికీ వృద్ధి నెమ్మదిగానే ఉంది. అలాగే, మే నెలలో కంటే జూన్‌లో జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. సేవల రంగంలోని ప్రయాణ, పర్యాటక, ఆతిథ్య రంగాలు ఇంకా కోలుకోనేలేదు. రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ రంగాలు మెరుగ్గా ఉన్నాయి. ఇదే సమయంలో కరోనా సెకెండ్ వెవ్ పరిస్థితులు కొనసాగుతుండటంతో ఆర్థికవ్యవస్థ పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం లేదని, ద్రవ్యోల్బణం పెరిగినా సర్దుబాటు వైఖరినే కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నట్టు” నిపుణులు వెల్లడించారు.


Next Story

Most Viewed