తెలంగాణపై కక్షగట్టిన కేంద్రం.. ఎంపీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

by  |
తెలంగాణపై కక్షగట్టిన కేంద్రం.. ఎంపీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, కాటారం : తెలంగాణ ప్రభుత్వంపైన, రాష్ట్రంలోని రైతులపైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టిందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బొడకుంట వెంకటేష్ ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో రూ. 22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించి సభలో ప్రసంగించారు.

ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో రైతులు ఎక్కువగా పండిస్తున్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 82 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా కేంద్ర ప్రభుత్వం కేవలం 25లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తీసుకునేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శం అన్నారు.

రైతుల సమస్యలను ఒకే వేదిక మీద చర్చించుకునేందుకు, రైతుల పంట మార్పిడి, ఉత్పత్తిలో నూతన విధానాలు, సేద్యంలో ఆధునిక పద్ధతులు తెలుసుకునేందుకు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మండల స్థాయిలో రైతు వేదికలను నిర్మించినట్టు పేర్కొన్నారు. రైతు బీమా, రైతుబంధు, వ్యవసాయ సేద్యానికి ఉచిత విద్యుత్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, వృద్ధులను ఆదుకునేందుకు ఆసరా, వితంతు పింఛన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను, దళితుల కోసం విశ్వవిద్యాలయాలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ భారతదేశానికి ఆదర్శవంతంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దాడని ఎంపీ కొనియాడారు.

కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడటంతో కొన్ని ప్రాజెక్టుల పనులు నిలిచిపోగా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారని, ఉద్యమకాలంలో గ్రామగ్రామానికి తిరిగినప్పుడు అన్ని సమస్యలను అవగాహన చేసుకున్నారని అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దళితుల అభ్యున్నతికి తెలంగాణ క్రాంతి పథకం రచించారని దానికి పూర్తి స్థాయి రూపమే ఇప్పుడు దళిత బంధు పథకం అన్నారు. ప్రతిపక్షాలు విమర్శించినట్లు ఇది ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన పథకం కాదని.. దళితుల అభ్యున్నతికి తోడ్పడే పథకమని అన్నారు.

దళిత బంధును గ్రామ గ్రామానికి తీసుకు వెళ్లాలని ఎంపీ వెంకటేష్ టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను నిరవధికంగా కొనసాగించిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని ఎంపీ వెంకటేష్ కొనియాడారు. అనేక సమస్యలు నెలకొన్న కాటారం మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేంత వరకూ విశ్రమించనని ఆయన హామీ ఇచ్చారు.

పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ.. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయి అమలుకు తన ఎమ్మెల్యే పదవి కాలం పట్టినట్లు.. పథకం మంజూరు సమయంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పనులు ప్రారంభించినట్లు ఆయన విమర్శించారు. సమస్యలపై కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించవచ్చు. తాము అభివృద్ధి చేస్తూనే ఉంటామని పుట్టమధు పేర్కొన్నారు. కాటారం మండల కేంద్రంలోని నాలుగు సర్వేనెంబర్‌లో గల రెండు వేల ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీ సహకారంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో కాటారం సర్పంచ్ తోట రాధమ్మ అధ్యక్షత వహించగా ఎంపీపీ పంతకాని సమ్మయ్య, జక్కు రాకేష్, ఎంపీటీసీ తోట జనార్ధన్, ఉప సర్పంచ్ నాయి శ్రీనివాస్ సింగిల్ విండో చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పల్ల బుచ్చయ్య, మండల కన్వీనర్ కుడుదుల రాజబాబు, డీఏఓ విజయ భాస్కర్, ఎమ్మార్వో శ్రీనివాసాచారి, ఎంపీడీవో ఆంజనేయులు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి, టీఆర్ఎస్ నాయకులు అనంతుల రమేష్ బాబు, ఎంపీటీసీలు మహేశ్వరి, రవీందర్ రావు, టీఆర్ఎస్ యువజన నాయకులు జక్కు రాకేష్ పాల్గొనగా.. కాటారం సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రంజిత్ రావు, ఎస్ఐ సాంబమూర్తి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed