టార్గెట్.. టీ20 ప్రపంచ కప్!

by Shamantha N |
టార్గెట్.. టీ20 ప్రపంచ కప్!
X

దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది-2024 క్రికెట్ అభిమానులకు నిజంగానే పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ముగిసిన రోజుల వ్యవధిలోనే జూన్-2 నుంచి టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పూర్తి చేసింది. వెస్టిండీస్, అమెరికా వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఈ పొట్టి వరల్డ్ కప్‌లో భాగస్వామ్యం అయ్యే క్రికట్ జట్లు ఇప్పటికే అమెరికా, వెస్టిండీస్‌కు చేరుకున్నాయి.

ఎలాగైనా కప్ కొట్టాలి..

2024 టీ20 వరల్డ్ కప్ భారత్‌కు చాలా కీలకం. ఎందుకంటే ఈ కప్ అనంతరం టీమిండియాలో పలువురు సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేకపోలేదు. వయస్సు రీత్యా వచ్చే టీ20 వరల్డ్ కప్‌కు రోహిత్,విరాట్ వంటి ప్లేయర్లు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.టీమిండియా ఇప్పటికు వరకు కేవలం 3 వరల్డ్ కప్‌లు మాత్రమే గెలిచింది. అందులో 1983 కపిల్ దేవ్ సారథ్యంలో వన్డే వరల్డ్ కప్, 2007లో ధోని సారథ్యంలో టీ20 వరల్డ్ కప్, 2011లో మళ్లీ ధోని నాయకత్వంలోనే వన్డే ప్రపంచ కప్ నెగ్గింది.ఇప్పటికే ధోనీ ఐపీఎల్ మినహా అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటించారు.

2007 టీ20 వరల్డ్ కప్ చివరిది..

మహేంద్ర సింగ్ ధోని కొత్తగా టీమిండియా నాయకత్వ బాధ్యతలు స్వీకరించాక భారత జట్టు 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ గెలుపొందింది. ఆ సమయంలో ఎటువంటి అంచనాలు లేకుండా టీమిండియా బరిలో దిగింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టోర్నీలో ఎవరూ ఊహించని విధంగా అటు బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించి టీ 20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ భారత జట్టుకు అందని ద్రాక్షగానే మిగిలింది. 2007 తర్వాత జరిగిన మూడు టీ20 టోర్నీల్లో

2009 సూపర్-8 (ఇంగ్లాండ్ వేదిక), 2010 సూపర్ 8 (వెస్టిండీస్ వేదిక), 2012 సూపర్ 8 (శ్రీలంక వేదిక) ఈ మూడు టోర్నీలో ఇండియా సెమీస్‌కు చేరలేకపోయింది.

2014 టీ 20 ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరినా శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. ఇక 2016 సెమీస్, 2021 సూపర్-12 (విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. 2022లో రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా జట్టు వరుస విజయాలతో సెమీస్‌కు చేరగా.. ఆ మ్యాచులో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది.ఇప్పటివరకు జరిగిన 8 ఎడిషన్లలో టీమిండియా ఒకేసారి టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది.

విదేశీ పిచ్‌లతో సవాళ్లు..

టీమిండియా ప్లేయర్లు స్వదేశంలో రెచ్చిపోయి ఆడినంతగా విదేశీ పిచ్‌ల మీద ఆడేందుకు ఇబ్బంది పడతారని చర్చ జరుగుతోంది. అయితే, 2011 వన్డే వరల్డ్ కప్ మినహా 1983 వన్డే వరల్డ్ కప్, 2007 టీ20 వరల్డ్ కప్ విదేశాల్లో నెగ్గిందని పలువురు గుర్తుచేస్తున్నారు. అయితే, ఈసారి జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ఎక్స్ పీరియన్స్‌కు కుర్రాళ్ల దూకుడు తోడైతే సులువుగా ఇండియా కప్ కొట్టే అవకాశాలున్నాయని మాజీ దిగ్గజ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు.

ఐపీఎల్ హీరోలకే ప్రయారిటీ..

టీ20 వరల్డ్ కప్ ముందు ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన క్రీడాకారులను టీమిండియా వరల్డ్ కప్ స్వ్కాడ్‌గా ప్రకటించింది. ఈ జట్టులో విరాట్, రోహిత్, బుమ్రా వంటి సీనియర్ల తర్వాత మిగతా అందరూ కుర్రాళ్లే ఉండటం గమనార్హం. శివమ్ దూబే, సంజూ శాంసన్, జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్ వంటి యంగ్ ప్లేయర్లు ఈసారి జట్టులో చోటు దక్కించుకున్నారు. కాగా, గిల్, రింకూ ప్రస్తుతం రిజర్వులో ఉన్నారు.

కాగా, ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ కొట్టాలని కసితో టీమిండియా బరిలోకి దిగినట్లు తెలుస్తోంది.కాగా, ఈ టోర్నీలో విరాట్, రోహిత్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, పాండ్యా, బుమ్రా మీదే ఫ్యాన్స్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ సారథ్యంలో కప్ కొట్టాలని టీమిండియాతో పాటు ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా, టీమిండియా తొలిమ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది.

భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, యశస్వి జైశ్వాల్‌, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, అర్షదీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌

రిజర్వ్ ప్లేయర్లు: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్

Next Story