సీఎం నవీన్​ పట్నాయక్​ ఆరోగ్యం క్షీణించడంపై దర్యాప్తు : ప్రధాని మోడీ

by Hajipasha |
సీఎం నవీన్​ పట్నాయక్​ ఆరోగ్యం క్షీణించడంపై దర్యాప్తు  : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ ​ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వెనుక ఏదైనా కుట్ర జరిగి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పడగానే ఈ అంశంపై ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేయిస్తామని మోడీ వెల్లడించారు. ఒడిశాలోని మయూర్​భంజ్​లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి ఈ కామెంట్స్ చేశారు. సీఎం నవీన్​ పట్నాయక్​ సన్నిహితుడు, తమిళనాడుకు చెందిన వీకే పాండియన్​ను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ ఈ సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘గతేడాది కాలంగా నవీన్​ బాబు ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆయన తన పనులను తాను చేసుకోలేకపోతున్నారు. ఇంతలా నవీన్ ఆరోగ్యం క్షీణించడం వెనుక ఏదైనా కుట్ర జరిగి ఉండొచ్చు. అందుకే కారణమైన వాళ్లే ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ’’ అంటూ ప్రధానమంత్రి సందేహాలు వెలిబుచ్చారు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఒడిశా ప్రజలను కోరారు. ఒడిశా వాస్తవ్యులే రాష్ట్ర సీఎం కావాలని మోడీ ఆకాంక్షించారు. ఇక బెంగాల్‌లోని కక్‌ద్వీప్‌లో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వం తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం ద్వారా ముస్లింలకు ఓబీసీల రిజర్వేషన్లను కట్టబెడుతోందని ఆరోపించారు. దీనివల్ల ఓబీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు.

ప్రధాని ఫోన్​ చేసి పరామర్శించాల్సింది : సీఎం నవీన్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఆరోగ్యంపై చేసిన వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ స్పందించారు. ‘‘ఒకవేళ ప్రధానికి నా ఆరోగ్యం గురించి అంతగా పట్టింపు ఉంటే.. ఫోన్ చేసి పరామర్శించి ఉండాల్సింది. నా ఆరోగ్యం గురించి వదంతులు వ్యాపింపజేసేవారు బీజేపీలో చాలామంది ఉన్నారు. నేను ఆరోగ్యంగా ఉన్నాను. గత నెల రోజులుగా రాష్ట్రంలోనే ప్రచారం చేస్తున్నాను’’ అని ఆయన స్పష్టం చేశారు.

Next Story