కాంగ్రెస్‌కు.. సోనియా, రాహుల్, ప్రియాంకపై ఉన్న ప్రేమ రైతులపై లేదు: ఎమ్మెల్యే శంకర్

by Satheesh |
కాంగ్రెస్‌కు.. సోనియా, రాహుల్, ప్రియాంకపై ఉన్న ప్రేమ రైతులపై లేదు: ఎమ్మెల్యే శంకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మార్కెట్‌లో నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, దొరికిన గంటకే నిందితులు బెయిల్‌పై బయటికు వస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు సరిపడ విత్తనాలు ఇచ్చే స్థితి ఈ ప్రభుత్వ హయంలో లేదని ధ్వజమెత్తారు. ఆయా ప్రాంతాల వారీగా నేల రకాన్ని బట్టి ఏ విత్తనాలు కావాలో కనీస అవగాహన కూడా ఈ ప్రభుత్వానికి లేదని విరుచుకుపడ్డారు. భార్యా పిల్లలతో సహా లైన్లో నిలబడితే కానీ విత్తనాలు దొరికే పరిస్థితి లేదని పాయల్ శంకర్ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ డూప్లికేట్ విత్తనాలు దొరికాయని, వాటిని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. చట్టాలు ఎక్కడ పోయాయని విరుచుకుపడ్డారు.

ఏ కంపెనీ ఏ రకం విత్తనాలు తయారు చేస్తుందనేది కూడా క్లారిటీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమది రైతు సర్కారని చెప్పుకుంటుందని, ఫసల్ బీమా పథకంలో రాష్ట్ర వాటా కట్టడంలో కూడా స్పష్టత లేదన్నారు. ఈ సమస్యపై చీఫ్ సెక్రటరీకి మెమొరాండం ఇచ్చామని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌కు.. సోనియా, రాహూల్, ప్రియాంకపై ఉన్న ప్రేమ రైతులపై లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వానికి 48 గంటలు సమయం ఇస్తున్నామని, ఆయా ప్రాంతాల వారీగా విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రైతుల తరపున ఉద్యమం చేస్తామని పాయల్ శంకర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ వైఫల్యాలపై ఫోకస్ పెట్టి తాము తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు తెలంగాణ లోగో, పాట అంటూ కాలం గడిపే యోచనలో ఉందని పాయల్ శంకర్ ధ్వజమెత్తారు.

Next Story