ఆ డాక్టర్ రికమెండేషన్ బ్యాచ్.. ససూన్ ఆస్పత్రి డీన్ సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |
ఆ డాక్టర్ రికమెండేషన్ బ్యాచ్.. ససూన్ ఆస్పత్రి డీన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పూణే పోర్షే కారు ప్రమాదం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రక్తనమూనాలు మార్చిన ససూన్ ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశారు. అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ససూన్ హాస్పిటల్ ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ అజయ్ తవాడే గురించి డీన్ వినాయక్ కాలే సంచలన కామెంట్స్ చేశారు. డాక్టర్ అజయ్ ను మహారాష్ట్ర వైద్యమంత్రి హసన్ ముష్రిఫ్, ఎమ్మెల్యే సునీల్ టింగ్రే ఒత్తిడి మేరకే ఫోరెన్సిక్ హెడ్ గా నియమించినట్లు తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డాక్టర్ అజయ్ కోసం మంత్రి, ఎమ్మెల్యే లేఖ పంపినట్లు పేర్కొన్నారు. మరోవైపు, ముష్రిఫ్, టింగ్రే ఇద్దరూ ఎన్సీపీకి చెందిన వారు కావడం గమనార్హం. అయితే, ప్రెస్ మీటింగ్ జరిగిన కొద్ది గంటలకే డీన్ వినాయక్ కాలేను మహాసర్కారు నిర్బంధ సెలవులపై పంపింది. కేసుని తీవ్రంగా పరిగణించడంలో విఫలమయ్యారని, సరైన నిర్ణయాలు తీసుకోలేదని సెలవులపై డాక్టర్ కాలేను పంపింది. ఇకపోతే, డాక్టర్ అజయ్ తవాడే, డాక్టర్ శ్రీహరి హర్నోర్ లను పూణే క్రైం బ్రాంచ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మైనర్ నిందితుడి కుటుంబం నుంచి డాక్టర్లకు రూ.3 లక్షలు లంచం ఇచ్చేందుకు సాయం చేశారనే ఆరోపణలపై ప్యూన్ అతుల్ ఘట్ కాంబ్లేని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Next Story