తెలంగాణ సమస్యలపై నజర్ పెట్టండి : ఎంపీ కోమటిరెడ్డి

by  |
తెలంగాణ సమస్యలపై నజర్ పెట్టండి : ఎంపీ కోమటిరెడ్డి
X

దిశ, న్యూస్‌బ్యూరో : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను లెటర్ రూపంలో ప్రధానికి వివరించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఫార్మా కంపెనీల నుంచి విడుదలయ్యే రసాయనాలు, డ్రైనేజీ మురుగు వలన మూసీనది కలుష్యమైందని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ట్రిట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలన్నీ కలుషిత మవుతున్నాయన్నారు. 300నుంచి500 ఫీట్ల లోతులోని నీటిలో మూసీ నీరు చేరడం వలన నీరంతా వాసన వస్తుందని వివరించారు. ఆ నీటితో పండిన పంటలు తినడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. కలుషిత నీరు తాగి పశువులు మృత్యువాత పడుతున్నాయన్నారు. నమామి గంగా తరహాలో మూసీ నదిని ప్రక్షాళన చేయాలని లోక్‌సభలో జీరో అవర్‌ మొదటి సెషన్‌, రెండో సెషన్‌లోనూ సమస్యను లేవనెత్తినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గౌరెల్లి జంక్షన్ కొత్తగూడెం జాతీయ రహదారికి నెంబరింగ్ ఇవ్వాలని కోరారు. వొలిగొండ, పోచంపల్లి, తిరుమలగిరి, తొర్రూరు, నెల్లికుదురు మహబూబాబాద్, ఇల్లందు మీదుగా హైదరాబాద్ కొత్త గూడెం మధ్య రహదారిని జాతీయ రహదారిగా కేంద్రం గుర్తించినప్పటికి, రోడ్డు నిర్మాణానికి, మరమ్మతులకు నోచుకోవడం లేదన్నారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే హైదరాబాద్, విశాఖపట్నం, ఛత్తీస్‌గఢ్‌ల మధ్య 100 కిలో మీటర్ల దూరం తగ్గుతుందన్నారు. ఈ రహదారి నా పార్లమెంట్ పరిధిలోనికే వస్తుందని స్పష్టంచేశారు. రోడ్డు నిర్మాణానికి 2016లో డీపీఆర్ సిద్ధం చేసినా నేటికి పనులు మొదలు కాకపోవడం బాధకరమన్నారు. 2019లో ఈ రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించినా నేటికి నెంబరింగ్ ఇవ్వలేదన్నారు. కావున ఇప్పటికైనా నెంబరింగ్ ప్రకటించి అప్ గ్రేడెషన్ పనులను వెంటనే ప్రారంభించాలని ఎంపీ కోమటిరెడ్డి ప్రధానికి అందజేసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Tags: mp komatireddy, pm modi, delhi, ts problems, moosi river, road development


Next Story

Most Viewed