పోలింగ్ పర్సంటేజ్ అందుకే తగ్గింది : బండి సంజయ్

5824

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడానికి అధికార టీఆర్ఎస్, ఈసీ, డీజీపీ, ఎంఐఎం పార్టీలే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.గ్రేటర్ ఎన్నికలు ముగిసాక నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ డైరక్షన్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం నడించిందన్నారు. ఓటర్లను బెదిరించి, భయాందోళనకు గురిచేసి ఓటింగ్ శాతం తగ్గేలా చేశారని, అయినా ఓటర్లు భయపడలేదన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, వారిపై దాడులకు తెగబడ్డారన్నారు. అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు భయపడకుండా టీఆర్ఎస్ అన్యాయాలను అడ్డుకున్నారని చెప్పారు.

సీఎం కేసీఆర్ కావాలనే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీ వేయలేదని, వారి మీద ఆయనకు నమ్మకం లేదన్నారు. అంతేకాకుండా, వరుసగా నాలుగు రోజులు సెలవు వచ్చేలా ముందే ప్లాన్ చేసి ఎన్నికల తేదీని ప్రకటించారని వ్యాఖ్యానించారు. సర్వేలన్నీ బీజేపీ అనుకూలంగా వచ్చాయని, ఓటమి భయంతోనే కేసీఆర్ కుటిల రాజకీయాలు చేశారని బండి విమర్శించారు. పోలింగ్ ముందు రోజు రాత్రి మద్యం, డబ్బు ఏరులై పారిందని, రాష్ట్ర పోలీసు యంత్రాంగం మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు.కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కార్యాకర్తలు నగదు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు.ఎక్కడా లేని విధంగా ఈసారి మంత్రులే బరితెగించి డబ్బులు పంచారని కరీంనగర్ ఎంపీ ఆగ్రహం వ్యక్తంచేశారు.