మై హోం అక్రమాలు కేటీఆర్, హరీశ్‌ మెడకు చుట్టుకుంటాయి

by  |
మై హోం అక్రమాలు కేటీఆర్, హరీశ్‌ మెడకు చుట్టుకుంటాయి
X

దిశ, నిజామాబాద్: ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర ఆరోపణలు చేశారు. మై హోం సంస్థ మైనింగ్ అక్రమాల కేసులు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు మెడకు చుట్టుకుంటాయని అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో మీడియా ఆయన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన కవితను ఎమ్మెల్సీ ఉప‌ఎన్నికల్లో గెలిపించేందుకు అక్రమాలకు తెరలేపారని విమర్శించారు. ఎన్నికల కోడ్ ఉండగానే మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కండువాలు వేసుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేషిలో మాధవనగర్ రైల్వే బ్రిడ్జి, మామిడిపల్లి ఓవర్ బ్రిడ్జి పనులు ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే కేంద్రాన్ని అడగాలని, సంబంధిత పనులపై బీజేపీ ప్రజాప్రతినిధులు నిరసన కార్యక్రమం చేపడుతారని ఎంపీ పేర్కొన్నారు.

లాక్‌డౌన్ కాలంలో ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ద్వారా ఆదుకుంటున్నారని, మోడీ.. రెండోసారి ప్రధాని అయ్యాక ఎన్నో మైలురాళ్లను అధిగమించారని గుర్తుచేశారు. త్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, రామ జన్మభూమి, సీఏఏ లాంటి గొప్ప చట్టాలు తీసుకువచ్చారన్నారు. బీజేపీ నుంచి వెళ్లిన వారికి రాజకీయ భవిష్యత్తు శూన్యమని, 2014 మున్సిపల్ ఎన్నికల తర్వాత బీజేపీని వీడిన వారి పరిస్థితి అందుకు ఉదాహరణ అన్నారు. బీజేపీ నుంచి వెళ్లినవారు తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిని ఎక్కడ ఉంచాలో తమకు తెలుసన్నారు.



Next Story