సాంఘిక దురాచారాన్ని నార్మలైజ్ చేస్తున్న సినిమాలు

by  |
సాంఘిక దురాచారాన్ని నార్మలైజ్ చేస్తున్న సినిమాలు
X

దిశ, ఫీచర్స్ : జనాలను ఎంటర్‌టైన్ చేయడమే కళల ప్రాథమిక ఉద్దేశ్యమైనా.. వాటికి సమాజాన్ని ఉద్దరించే శక్తి ఉందనడంలో సందేహం లేదు. మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే ప్రధాన కర్తవ్యమైనా.. నిత్యం సమాజంలో చోటుచేసుకునే అంశాలే ఇందుకు కథావస్తువులు. సామాజిక దురాచారాలను ప్రశ్నించడంతో పాటు వాటికి పరిష్కారం చూపడంలోనూ కళలది కీలక పాత్ర. అందుకే కళకు, కళాకారులకు సమాజంలో ప్రత్యేక స్థానముంటుంది. కాగా మారుతున్న కాలాన్ని ప్రతిబింబిస్తూనే, మారాల్సిన విషయాలపై సమజానికి దిశానిర్దేశం చేసే అనేక కళా రూపాల్లో సినిమా మాధ్యమం ఒకటి. అన్నిటికన్నా అత్యంత ప్రభావవంతమైన ఈ ప్లాట్‌ఫామ్ అనేక దశల్లో ప్రజల్ని చైతన్యపరుస్తూనే ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వాలే నిషేధించిన కొన్ని సంప్రదాయాలను సాధారణీకరించడంలోనూ ముందుంటోంది. దశాబ్దాల కిందటి సినిమాలు కూడా వరకట్నం సాంఘిక దురాచారమని చిత్రీకరిస్తే.. నేటి చిత్రాలు మాత్రం దీన్ని నార్మలైజ్ చేసినట్లు కనిపిస్తోంది. అలాంటి కొన్ని సినిమాలపై స్పెషల్ ఫోకస్..

మన దేశంలో ‘వరకట్న నిషేధ చట్టం(1961)’ అమలులోకి వచ్చి 60 ఏళ్లు దాటింది. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా సినిమాల్లో వరకట్నాన్ని ఒక సాధారణ పద్ధతిగానే చూపిస్తున్నారు. సినిమాల్లో దీన్ని ఒక నేరంగా పరిగణించడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అనేక చిత్రాల్లో ‘డౌరీ’ అంశాన్ని కథానాయకుడి హీరోయిజం పెంచేందుకే ఉపయోగిస్తారు. అలాంటి కథల విషయానికొస్తే.. హీరో తన అక్క లేదా చెల్లికి గొప్పింటి వ్యక్తితో పెళ్లి చేసేందుకు భారీగా కట్న కానుకలు ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు. ఇందుకోసం ఆస్తిలో తన వాటాను కూడా త్యాగం చేస్తాడు. కథలో భాగంగా తన చుట్టుపక్కల జరిగే ప్రతీ అన్యాయాన్ని ఎదిరించే పవర్‌ఫుల్ హీరో.. ‘కట్నం ఎందుకు ఇవ్వాలి?’ అని మాత్రం ప్రశ్నించడు. సామాజిక బాధ్యతతో సినిమాలు నిర్మిస్తున్నామని చెప్పుకునే మేకర్స్.. ఈ విషయాన్ని కేవలం హీరో ఎలివేషన్‌ కోసం వాడుతూ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని?

శ్రీకారం..

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలనే కాన్సెప్ట్‌తో గతేడాది రిలీజైన సినిమా ‘శ్రీకారం’. ఇందులో హీరోతో పాటు కొందరు రైతులు గ్రూప్‌గా ఏర్పడి ‘కమ్యూనిటీ వ్యవసాయం’ చేస్తారు. అలా మొదటిసారి పొందిన లాభాలను ఏదైనా మంచి పనికి ఉపయెగించాలని డిసైడ్ అవుతారు. ఓ రైతు.. కూతురి పెళ్లి సమయంలో కట్నంగా ఇస్తానని వాగ్దానం చేసినా భూమి పత్రాలను ఇవ్వలేదని, ఆమె భర్త తనను పుట్టింటికి పంపిస్తాడు. అందుకే రైతులంతా అతడి అప్పు చెల్లించి పత్రాలు విడిపించి మంచి పని చేస్తారు. భూమి పత్రాలు ఇచ్చి తనను అత్తవారింటికి పంపిస్తారు. అంటే మొత్తం సినిమాలో కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం అని ఏ పాత్రలు చెప్పకపోగా.. కుమార్తెకు కట్నం ఇవ్వాలనే సూచిస్తాయి.

శివరామరాజు..

2002లో జగపతిబాబు లీడ్ రోల్‌లో వచ్చిన ‘శివరామరాజు’ చిత్రంలో తన చెల్లెలు ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి జరిపించేందుకు ముగ్గురు సోదరులు ఆస్తి మొత్తం రాసిస్తారు. ఇక్కడ రెండు కుటుంబాల మధ్య సంబంధం కలుపుకునే విషయంలో ‘ఇచ్చి పుచ్చుకునే’ కాన్సెప్ట్ కనిపిస్తుంది. వరుడి కుటుంబం.. వధువు కుటుంబాన్ని ఉద్దేశించి ‘మేము ధనవంతులమే, మీరు కట్నం ఇవ్వకపోయినా మీ అమ్మాయిని బాగానే చూసుకుంటాం. కానీ సంప్రదాయం ప్రకారం అడుగుతున్నాం’ అంటారు. వధువు సోదరులు కూడా తమ చెల్లెలిని ఖాళీ చేతులతో పంపమని.. చెల్లెలి మీద ప్రేమకు ఆస్తి మొత్తం రాసి ఇవ్వమన్నా? ఇస్తామంటారు. అయితే ఇవ్వండని వరుడి తండ్రి కోరడంతో ఆలోచనలో పడతారు. మీరిచ్చేది మీ చెల్లెలి మీద ఎంత ప్రేముందో తెలియజేస్తుందని చెప్పడంతో ఫైనల్‌గా ఆస్తి మొత్తం రాసిచ్చేందుకు ఒప్పుకుంటారు. ఇక్కడ వారి హీరోయిజం ఎలివేట్ చేసేందుకు డౌరీని నార్మలైజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్.

రాఖీ..

జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా నటించిన చిత్రం రాఖీ. తన చెల్లెలు గాయత్రికి జరిగిన అన్యాయానికి సోదరుడు రాఖీ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడనేది కథ. సినిమాలో గాయత్రి పెళ్లిచూపుల సీన్.. పేద, మధ్యతరగతి ఇండ్లల్లో మధ్యవర్తుల సాయంతో వరకట్న సంభాషణలు ఎలా జరుగుతాయో వర్ణించింది. ఇక వరుడు అమెరికా వెళ్లబోతున్నందున, అతడి ఫ్యామిలీ రూ.15 లక్షల కట్నాన్ని బహిరంగంగానే డిమాండ్ చేస్తుంది. వధువు ఫ్యామిలీకి అంత స్థోమత లేకున్నా మీడియేటర్స్ జోక్యంతో రూ.10 లక్షలకు సెట్ చేస్తారు. అయితే పెళ్లి తర్వాత, వరుడికి రూ. కోటి కట్నం ఇస్తామంటూ మరో సంబంధం రావడంతో అప్పటి నుంచి గాయత్రి గృహ హింసకు గురవుతుంది. ఇదే క్రమంలో భర్త, అత్త కలిసి తనను కాల్చి చంపి అగ్ని ప్రమాదంగా చిత్రీకరిస్తారు. ఆమె చనిపోయే వరకు కూడా ఈ సినిమాలో వరకట్నం అనేది నేరంగా పరిగణించబడదు. ఆ తర్వాత మహిళలపై నేరాలకు పాల్పడే వ్యక్తులను వేటాడేందుకు రాఖీకి ఈ సంఘటనే ఒక కారణం అవుతుంది. పగ తీర్చుకునే క్రమంలో అతని హీరోయిజమే ప్రదర్శించినట్టు ఉంటుంది తప్ప, లింగ హింసకు మూల కారణాన్ని పరిష్కరించే ప్రయత్నంగా ఉండదు.

బాధితుడి మరణం వంటి అవాంఛనీయ సంఘటన జరిగిన తర్వాత మాత్రమే కొన్ని సినిమాలు వరకట్నాన్ని నేరంగా చూపుతాయి. ఇంకా చెప్పాలంటే ఓ మధ్యతరగతి తండ్రి కూతురి పెళ్లికి డబ్బు సమకూర్చుకునేందుకు అష్టకష్టాలు పడుతుంటాడు. ఇలాంటి సీన్స్‌లో ట్రాజెడీ పండించేందుకు కట్నం కోసం దాచిన డబ్బు దొంగిలించబడినట్లుగా లేదంటే పోయినట్లుగా చూపిస్తారు. ఇక్కడ దొంగిలించినవాడినే అపరాధిగా చూపిస్తారు తప్ప కట్నం అడిగేవాడిని కాదు. అంటే అసలు తప్పును ఎత్తిచూపకుండా సమకాలీన సినిమాలు తప్పించుకుంటున్నాయనే విషయం స్పష్టమవుతోంది. మొత్తానికి మనం అంగీకరించినా, అంగీకరించకపోయినా మార్కెట్, సమాజం.. ప్రజలు, కుటుంబాలను ఎలాగైతే ప్రభావితం చేస్తాయో సినిమాలు కూడా అంతే. అందుకే కేవలం నాటకీయత కోసం వరకట్నాన్ని నార్మలైజ్ చేయడం తగదనేదే వాదన.


Next Story

Most Viewed