- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’ రాకతో మెగాస్టార్‌కు లైన్ క్లియర్.. ‘విశ్వంభర’ విడుదలకు డేట్ లాక్ !
రామ్ చరణ్ సినిమా వచ్చిన సరిగ్గా నెల రోజుల తర్వాత, అంటే జూలై 10న ‘విశ్వంభర’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా, అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే, ఈ మూవీ విడుదల తేదీ విషయంలో గత కొంతకాలంగా మెగా అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధతకు ఇప్పుడు ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కానీ, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అత్యంత కీలకం కావడంతో, ఆ గ్రాఫిక్స్ పనుల కోసం ఎక్కువ సమయం పట్టింది. ఆ తర్వాత వేసవిలో విడుదల చేయాలనుకున్నా.. పనులు పూర్తి కాకపోవడంతో చిత్ర యూనిట్ సైలెంట్‌గా ఉండిపోయింది. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో మెగాస్టార్ కూడా గ్రాఫిక్స్ వర్క్‌కు పూర్తి సమయం ఇచ్చారు.
తాజా సమాచారం ప్రకారం, జూన్ 4న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల కాబోతుండటంతో, మెగాస్టార్ ‘విశ్వంభర’కు లైన్ క్లియర్ అయింది. రామ్ చరణ్ సినిమా వచ్చిన సరిగ్గా నెల రోజుల తర్వాత, అంటే జూలై 10న ‘విశ్వంభర’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఈసారి అయినా విడుదల అవుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. జూలై నాటికి గ్రాఫిక్స్ పనులన్నీ పూర్తి చేసి, వెండితెరపై ఒక విజువల్ వండర్‌ను చూపించాలని దర్శకుడు వశిష్ట పట్టుదలతో ఉన్నారట. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఒక కీలక పాత్రలో మెరవనుంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ చేస్తున్న పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ సినిమా కావడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.






