25 మందిని కాదని మమితనే ఎందుకు తీసుకున్నారు? ‘కర’ మూవీ సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్

by Mallepaka Hamsa |

ధనుష్ సినిమా 'కర' కోసం మమిత బైజును ఎంపిక చేయడం వెనుక ఉన్న ఆసక్తికర కారణాలను దర్శకుడు విఘ్నేష్ రాజా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

25 మందిని కాదని మమితనే ఎందుకు తీసుకున్నారు? ‘కర’ మూవీ సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్
X

దిశ, సినిమా: తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం మలయాళ ముద్దుగుమ్మల హవా నడుస్తోంది. కోలీవుడ్ బ్యూటీస్‌కు అవకాశాలు తగ్గించి, మాలీవుడ్ భామలకే పెద్ద పీట వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నప్పటికీ, కొందరు హీరోయిన్లు మాత్రం తమ ప్రతిభతో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ రేసులో అందరికంటే ముందున్నారు మలయాళీ సెన్సేషన్ మమిత బైజు. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయారు. అగ్ర హీరోల చిత్రాల్లో ఈమెకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంలో నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ ధనుష్ జంటగా 'కర' సినిమాలో నటిస్తోంది.

అంతేకాకుండా, దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 'జననాయగన్' చిత్రంలోనూ మమిత ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇలా క్రేజీ ప్రాజెక్టులతో ఈ మలయాళ కుట్టి కోలీవుడ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. ధనుష్ సినిమా 'కర' కోసం మమిత బైజును ఎంపిక చేయడం వెనుక ఉన్న ఆసక్తికర కారణాలను దర్శకుడు విఘ్నేష్ రాజా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. హీరోయిన్ల ఎంపిక అనేది వారి భాషనో, ప్రాంతాన్నో చూసి జరగదని ఆయన స్పష్టం చేశారు. "ఒక పాత్రకు హీరోయిన్‌ను సెలెక్ట్ చేసేటప్పుడు ఆమె నటనా ప్రతిభ, ఆ పాత్రకు ఆమె ఎంతవరకు సెట్ అవుతుంది ఆమెకున్నా.. మార్కెట్ విలువను మాత్రమే చూస్తాం" అని విఘ్నేష్ రాజా తెలిపారు.

మమిత ఎంపిక గురించి వివరిస్తూ.. "కర చిత్రం కోసం మమిత కంటే ముందు సుమారు 20-25 మంది హీరోయిన్లు ఆడిషన్ చేశాం. కానీ వారెవరూ ఆ పాత్రకు కావాల్సిన మేనరిజమ్స్ లేదా ప్రతిభను చూపించలేకపోయారు. చివరగా మమిత ఆడిషన్‌కు వచ్చినప్పుడు, ఆమె నటన అందరికంటే స్పష్టంగా, మెరుగ్గా అనిపించింది. అందుకే ఆమెను ఫైనలైజ్ చేశాం" అని దర్శకుడు పేర్కొన్నారు. మమిత బైజు, ధనుష్ కాంబినేషన్‌లో రాబోతున్న 'కర' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం 1990వ దశకంలో రామనాథపురంలో జరిగిన ఒక యదార్థ బ్యాంకు దోపిడీ సంఘటన ఆధారంగా రూపొందుతోంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామాలో మమిత పాత్ర ఎంతో సహజంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. భాషతో సంబంధం లేకుండా కేవలం టాలెంట్‌తోనే అవకాశాలు దక్కించుకుంటున్న మమిత బైజు, కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Next Story