Balagam Movie :‘బలగం’ సినిమా నుండి ఏం నేర్చుకుందాం..?

by Disha Web Desk 13 |
Balagam Movie :‘బలగం’ సినిమా నుండి ఏం నేర్చుకుందాం..?
X

రెండు నెలల క్రితం విడుదల అయిన బలగం సినిమాలో ప్రతి సన్నివేశం నిజానికి అతి దగ్గరగా, తెలంగాణ పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక్క ఘట్టం జరిగినట్టుగానే ఉంది. సినిమా మొత్తం ఒక్క కుటుంబం చుట్టే తిరిగినా, దానిలోని ఎన్నో సన్నివేశాలు తెలంగాణలో ప్రతీ కుటుంబంలో జరిగినట్టుగానే ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోకాలంగా దూరమయిన కొంతమంది రక్తసంబంధీకులు కలిసిపోయినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. కొన్ని పల్లెల్లో ఈ సినిమాను ప్రదర్శించడమనేది,1990 దశకంలో గోడ సినిమాగా వేసిన 'కన్యాశుల్కం'ను గుర్తుకుతెస్తుంది. అందుకే ఆ సినిమా అందరి హృదయాలను గెలుచుకొని, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాలు సమాజానికి అద్దాల్లాంటివి. సమాజంలో జరిగేవాటినే చిత్రరూపంలో చూపించే ప్రయత్నం చేస్తారు. చాలామంది సినిమాను వినోదంగా చూస్తే, కొంతమంది సినిమాను సందేశం ఇచ్చి సమాజంలో మార్పుకు శ్రీకారం చుడుతుందని నమ్ముతారు. అయితే ఈ సినిమాను ఒక సామాజిక కోణంలో చూస్తే ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు.

తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలు..

ఎన్ని బాధలున్నా సరే, తాత (గాజుల కొమురంబలరామ నరసయ్య) లాగా గుండెల్లోనే దిగమింగుకొని ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, మనిషి జోరుమీదుండాలి, మాటలు హుషారుగా రావాలి. ముసలితనం శరీరానికే కానీ మనసుకు కాదు అని గుర్తించాలి. ఒకరినొకరు మందలించుకుంటూవుంటే మనిషి తనకున్న బాధలను మరిచిపోతాడు. దేవుణ్ణి నమ్మడం, నమ్మకపోవడం వ్యక్తిగతం. మతాన్ని ఆచరించే ప్రతీ ఒక్కరు ఆచార వ్యవహారాలు పాటిస్తారు. అయితే చిన్న కొడుకు సూరత్ నుండి వచ్చినందున, సినిమాలో చూపెట్టిన కుటుంబం మార్కండేయ వంశానికి చెందిన పద్మశాలి కులస్తులుగా అంచనా వేయవచ్చు. వారు బ్రాహ్మణుల ఆచారాల్లో కొన్నింటిని అనుసరిస్తూనే, ఎన్నో తరాలుగా పాటిస్తున్న బహుజనుల సాంప్రదాయాలను కూడా విరివిగా పాటిస్తారు. పుట్టుక మొదలు, పురుడు చేయడం, పేరు పెట్టడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పెళ్ళి చేయడం, అమ్మాయిలకు అయితే చెవులు కుట్టించడం, చీర కట్టించడం, మగపిల్లలకు ఉపనయనం పంచ కట్టించడం, తదితర ముఖ్య ఘట్టాలన్నీ మత-ప్రాంత-కుల ఆచారాలను బట్టే జరుగుతాయి.


ఆ సంస్కృతులను పాటించడంలో ఏ తప్పు లేదు. అలాగే దసరా, సంక్రాంతి, బోనాలు, తదితర పండుగలప్పుడు, పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ, సమ్మక్క-సారక్క, ఇతర స్థానిక జాతరలప్పుడు దేవుడి పేరుమీద యాటలు కోసుడు, మందు తాగుడు షరామామూలే. ఇవ్వే కాకుండా ఈ మధ్య తెలంగాణ యువత కొత్త సంవత్సరం, పుట్టినరోజు, పెళ్లిరోజులకు కూడా మంచిగా దావత్‌‌లు చేసుకుంటుంది. ఎవరైనా భోజనానికి పిలిచారంటే చాలు మగవాళ్ళు ఇంత మందు వేసుకొని మరీ వెళ్తారు. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు ముఖ్యంగా పెళ్ళికో, ఏదైనా ఫంక్షన్‌కో, చావుకో పోతే అక్కడ కూడా బారువైను బెల్టు షాపు ఎక్కడుందో దేవులాడి మరీ తాగడానికి వెళ్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే పండుగలు-పబ్బాలప్పుడే కాకుండా సంతోషంగా ఉన్నా, మనసు బాగాలేకున్నా మందే దిక్కు. ఎలాగైనా తాగాలని అనుకున్న వ్యక్తికి రోజూ పండుగే, అసలే తాగద్దు అనుకున్న వ్యక్తికి ఏ పండుగైనా నిమ్మళంగా ఉంటాడు. తినడంలో తప్పు లేదు, కానీ వచ్చిందంతా తాగుడుతోనే. ఇంట్లోనే అందరూ కలిసి తాగడం సమానత్వానికి, దాపరికం లేనితనానికి ఓ సూచికే.

బర్రె చేనులో మేస్తే, దుడ్డె గట్టున మేస్తదా..?

కానీ అసలు ఆడైనా, మగైనా, ఇల్లైనా, బారైనా, లేనోళ్ళైనా, ఉన్నోళ్ళైనా, పెగ్గైనా, జెగ్గైనా ‘ఆల్కహాల్’మంచిది కాదని ఎన్నో పరిశోధనలు రూఢీ చేస్తున్నాయి,ఎందరో డాక్టర్లు మొత్తుకుంటున్నారు. అగ్గువుండే చీపు లిక్కరైనా, ధరగల్ల ఫారిన్ విస్కైనా కార్జాన్ని (లివర్) ని తూట్లు పొడిచి, రోగాలపాల్జేసేవే, కాకపోతే కొంచెం ముందూ వెనకా అంతే. లేనోళ్ళు మందుకు బానిసైతే, పనికిపోలేక పైసలు పాయే, పానం ఖరాబాయే, దావఖానా ఖర్చులాయే, ఇల్లంతా రూటు తప్పుతదాయే, ఊళ్లే విలువా ఉండదాయే. అందుకే మందువ్యసనం లేనోళ్ళనే ఎన్నో రకాలుగా దెబ్బతీస్తుంది. ఏదో పున్నానికో, అమాసకో అంటే అర్థం చేసుకోవచ్చు, నిత్తె తాగుకుంటనే ఉంటే ఇల్లుగడిచేదెట్లా ఇలా వాళ్ళ కుటుంబాల్లో తాగడం చూసిన మగపిల్లలు పదో తరగతికి రాకముందే తాగుడు అలవాటు చేసుకోవడని గ్యారంటీ ఏముంది? తను తండ్రి బాటలో నడవద్దని ఎలా ఆశించగలం? బర్రె చేనులో మేస్తే, దుడ్డె (దూడ) గట్టున మేస్తదా? ఇంటికి కావాల్సిన అవసరాలు ఏమున్నయి, పిల్లలకు మంచి నడవడిక, కుటుంబ విలువలు, నైతిక విలువలు ఎలా నేర్పాలి, వారిని ఎలా ప్రయోజకులను చేయాలి, ఇంట్లో ఏయే సౌలతులు కావాలి, వాటన్నింటికి నెలయాదాడి లెక్కన ఎంత ఖర్చౌతుంది, దానికోసం ఏంచేయాలి, ఎటువంటి దురలవాట్లు వదులుకోవాలి, ఎటువంటి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి, దుబారా ఖర్చు ఎలా తగ్గించుకోవాలి’ అని ఇలా రకరకాలుగా ఇంటి పెద్ద ఆలోచన చేస్తేనే కదా వారి కుటుంబం పురోగతి చెందేది.


లేకపోతే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, మానసికసమస్యలే కాకుండా, ఇతరత్రా ఎన్నో ఊహించని సమస్యలు చుట్టుముట్టి, కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి. ఇప్పటికీ దహనసంస్కారాల నుండి దినాలయ్యే దాకా చాలా కొద్దిమంది వాళ్ళ శక్తికి మించి తాగి, సొలగడం, మందు ఎక్కువై సోయి లేకుండా పడిపోవడం, ఆ మత్తులో వాళ్ళకు నచ్చని వారితో దౌడాలు పెట్టుకోవడం, కక్కడం, అరవడం, కింద పడి బొర్రడం చూస్తూనే ఉంటాం. అసలు ఇంట్లో ఒక మనిషి చనిపోతే బాధలో ఉండాల్నా, ఈ తాగుడేందని కొంచెం జ్ఞానానికచ్చిన పిల్లలు, యుక్త వయస్సులో వున్నోళ్ళు, పెద్ద మనుషులు బీరిపోవడం చూస్తాం. దీన్ని సినిమాలో మనవడి(సాయిలు) బిత్తరచూపుల ద్వారా చూపించారు.

ఇంటిపెద్ద కడుపొక్కడే నింపుకోవడం ఏ ధర్మం కిందికి వస్తుంది..?

దేవుడు, సాంప్రదాయాల పేరుచెప్పి, పరువు-ప్రతిష్టలకు పోకుండా ఉన్నంతలో వెళ్లదీసుకోవాలి. దేవుడికి మనం మొక్కేది కష్కెడు మందు, చిన్న గిలాశెడు కల్లు, గంటెడు (యాటకోడి) కూర, కానీ మనం తాగేది, తినేది మాత్రం షేర్లకు షేర్ల మందు, కుండలకు కుండల కల్లు, బకీట్లకు బకీట్ల కూర. ఇదంతా చూస్తే, మనిషి బ్రతకడానికి తినకుండా, తినడానికే బ్రతుకుతున్నట్టుగా అనిపించకమానదు. అలాగే, ఉపశమనమనే (రిలీఫ్) పేరుతో తాత్కాలిక మైకం కోసం మందు తాగుతున్నాడు. తర్వాత్తర్వాత ఆ మైకానికే లొంగిపోయి, మందుకే దాసుడౌతున్నాడు. ఇంకా, మనిషి అన్నీ తిని తాగితేనే బాగా సంతోషంగా ఉన్నట్టుగా, తినితాగని వాళ్ళని పీసునారోల్లని వెక్కిరించడం తెలంగాణ సమాజంలో ఎప్పటినుండో పాతుకుపోయింది. అయితే పిసినారితనం, తినితాగడం రెండూ ఏ సంబంధం లేని అంశాలు. ఇవి రెండు వ్యతిరేకమూ కాదు. వారి వారి సామాజిక లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఒక వ్యక్తికి ఇలా తినడం-తాగడం చిన్నప్పటి నుండే అలవాటు లేకపోవచ్చు లేదా మధ్యలో ఎప్పుడైనా మానేయవచ్చు.

అయినా కుటుంబ సంక్షేమం వదిలి, తన కడుపొక్కటే నింపుకోవడం ఏ ధర్మం కిందికి వస్తుంది? ఈ చిన్న లాజిక్కును అర్థం చేసుకుంటే చాలు. దీనికి ఏ మత గ్రంథాల్లోని ప్రతి పేజీని తిప్పనవసరంలేదు, ఏ మత గురువులను అడగనక్కరలేదు, పెద్ద పెద్ద సదువులు చదవాల్సిన అక్కెర అంతకంటే లేదు, కేవలం బుద్ధికుశలత ఉంటే సరిపోతుంది. సమాజంలో మన కళ్ళతో మనం రోజూ చూసే సొంత అనుభవాల నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అనుభవమే అసలు గురువు, దాన్ని మించిన జ్ఞానమేముంటుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా, ఆడంబరాలకు పోయి, పదిమంది ఏమనుకుంటారోనని, ఎచ్చిడికి ఏతులకు అప్పు చేసి బాగానే ఫంక్షన్లు చేయచ్చు కానీ ఆ అప్పు తీర్చేది రాబోయే తరం వాళ్ళు అని మరువరాదు. బెల్లం ఉన్నప్పుడే ఈగలు ముసురుతాయన్న పెద్దల మాటలు దిమాక్‌ల పెట్టుకోవాలి. పిలిచినప్పుడు అందరూ వచ్చి తిని-తాగి పోతారు. కానీ పైసలు లేనప్పుడు ఎవ్వరూ ఆదుకోరు, అప్పులైతే ఇంటి దిక్కు కూడా కనీసం చూడరు.

మూఢ విశ్వాసాల్లో ఉందామా, విజ్ఞాన నేత్రం తెరుద్దామా..!

ఎవరైనా చనిపోతే వారిని చూడడానికి భయంతో వెళ్ళవద్దు. ఎందుకంటే ‘యద్భావం తద్భవతి’ అన్నట్టుగా మనం దయ్యం అనే ఆలోచనతో ఉంటే, అదే మనల్ని పట్టి పీడిస్తుంది. సినిమాలో టైలర్‌ని వట్టిగానే భయపడే వాడిగా చూపించారు. అయితే నిజానికి దయ్యం పట్టిందని మనాది రంధి పెట్టుకొని అదే ఆలాపనతో ఉండటం మూలంగా ఒక రకమైన దయ్యమనే ఫోబియాతో, మానసిక ఆందోళనకు గురవుతాడు. అలాగే, మరో వ్యక్తి బాగా గరం మసాలాలు వేసి వండిన మటన్ ముక్కలు బాగా తిని బైలు బాట పట్టడం, ఇంకో అమ్మ పిట్టకు పెట్టడానికి అంతదూరం నడవడం, పిట్టకోసం చాలా సేపు ఎదురుచూడటం, పొద్దున అన్నం తినే అలవాటున్న ఆమె ఏమీ తినకపోవడం వాళ్ళ ఆమెకు నడుం నొప్పో లేక కాస్త అలసటగా అనిపించటం సహజం. పిట్ట ముట్టకపోవడం ఒకవైపు, ఆడికి వెళ్ళిన వాళ్ళల్లో కొందరు ఇలా సుస్తు కావడం మరోవైపు కలిసి దయ్యమనే మూఢ నమ్మకానికి రెక్కలువచ్చి ఊళ్ళో ఉండే ప్రతీ గడపకు జెప్పన పాకుతుంది.

ఈ విషయాలన్నీ పల్లెల్లో వారిని అధికంగా టెన్షన్ పడేలా చేస్తాయి తప్ప అక్కడ దయ్యంలేదు, భూతంలేదు. కానీ మనిషి జీవితంలో పైకి రావాలంటే కొన్ని మూఢ నమ్మకాలను అంతగా పట్టించుకోకుండా, మారిన కాలాన్ని బట్టి విజ్ఞాస శాస్త్రంపై విశ్వాసాన్ని ఉంచుకుంటూ, ప్రతిరోజూ పాటించాలి. చివరగా, తెలంగాణ పల్లె జనాల్లో ప్రేమానురాగాలు, మమతానుబంధాలు, ఆప్యాయతలు చాలా ఎక్కువనేది జగమెరిగిన సత్యం. కానీ ‘సుక్క’,‘ముక్క’ చేయబట్టి ఆత్మాభిమానం కూడా ఎక్కువున్న ఆ పల్లెజనాలే విడిపోతారని, సంవత్సరాల తరబడి ఎడమొహం పెడమొహంగా ఉంటారనీ ప్రతీ తెలంగాణ పౌరుడు అర్థం చేసుకుని, తాహతును, సందర్భాన్ని బట్టి మసులుకుంటే, ఏ సమస్యాలేకుండా ప్రతీ పల్లె ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికే దేశంలో తాగుట్ల నెంబర్ వన్‌గా రికార్డులు సొంతం చేసుకున్న తెలంగాణ, పొరుగు రాష్ట్రాల వారిని చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. తద్వారా సుఖ శాంతుల తెలంగాణకు బాటలుపడి, మానవ వనరుల అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శమౌతుంది.

డా. శ్రీరాములు గోసికొండ, అసిస్టెంట్ ప్రొఫెసర్,

నర్సీ మోంజీ డీమ్డ్ యూనివర్సిటీ, జడ్చర్ల

9248424384: 8106986902

ఇవి కూడా చదవండి : అత్యంత వేగంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘2018’



Next Story

Most Viewed