మేము చాలా ఏళ్లు కలిసే చదువుకున్నాం.. స్టార్ హీరోతో ఉన్న బంధంపై శృతి హాసన్ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

మేము చిన్నప్పుడు చెన్నైలోని రెండు ప్రముఖ పాఠశాలల్లో కలిసి చదివాం. ఆ సమయంలో మేము తరచూ కలుసుకునేవాళ్లం.

మేము చాలా ఏళ్లు కలిసే చదువుకున్నాం.. స్టార్ హీరోతో ఉన్న బంధంపై శృతి హాసన్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ దిగ్గజం కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శృతి హాసన్. కేవలం హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గా, మ్యూజిక్ కంపోజర్‌గా మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్న ఈ భామ, తాజాగా ఒక క్రేజీ విషయాన్ని బయటపెట్టింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తనకు చిన్నప్పటి నుంచే తెలుసని, ఆయనతో తనకున్న స్పెషల్ బాండింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి తాము ఓకే స్కూల్‌లో చాలా ఏళ్లు చదువుకున్నట్లు వెల్లడించింది. "మేము చిన్నప్పుడు చెన్నైలోని రెండు ప్రముఖ పాఠశాలల్లో కలిసి చదివాం. ఆ సమయంలో మేము తరచూ కలుసుకునేవాళ్లం. మా ఇద్దరి మధ్య అప్పటి నుంచే మంచి స్నేహం ఉంది" అని శృతి వెల్లడించింది. స్టార్ కిడ్స్ అయినప్పటికీ స్కూల్ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేవారమని ఆమె చెప్పుకొచ్చింది. స్కూల్లో ఉన్నప్పుడు దుల్కర్ సల్మాన్ శృతిని ఒక వింత పేరుతో పిలిచేవాడని గుర్తు చేసుకుంది.

"స్కూల్ డేస్‌లో దుల్కర్ నన్ను ‘సోంబి’ అని పిలిచేవాడు. దానికి ఒక కారణం ఉంది. అప్పట్లో నేను విద్యార్థులందరితో కలిసి ‘సోంబి’ అనే పాటను పాడాను. అది విన్నప్పటి నుంచి దుల్కర్ నన్ను అదే పేరుతో ఏడిపించేవాడు. విశేషం ఏంటంటే.. అప్పట్లో స్కూల్లో ఉన్న మిగతా పిల్లలకు నేను కమల్ హాసన్ కూతురిని అని మాత్రమే తెలుసు కానీ, నా పేరు శృతి అని చాలామందికి తెలియదు" అంటూ నవ్వుతూ పాత జ్ఞాపకాలను పంచుకుంది. చిన్నప్పుడు స్కూల్లో కలిసి అల్లరి చేసిన ఈ ఇద్దరు స్టార్ కిడ్స్, ఇప్పుడు వెండితెరపై జంటగా అలరించబోతున్నారు. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ మూవీలో శృతి కీలక పాత్రలో కనిపించనుంది. పవన్ సాదినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా ఆధ్వర్యంలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించగా, స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ దీనిని సమర్పిస్తున్నారు

.

Next Story