మేము నటులం.. వస్తువులం కాదు.. బాడీ పార్ట్స్‌పైనే ఫోకస్ చేస్తున్నారంటూ సప్తమి గౌడ సంచలన పోస్ట్

by Mallepaka Hamsa |

మేము ఇక్కడ ఉన్నది మా కళ కోసం, సినిమా కోసం. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా అసభ్యకరమైన యాంగిల్స్ నుంచి ఫొటోలు తీస్తూ మమ్మల్ని కించపరుస్తున్నారు.

మేము నటులం.. వస్తువులం కాదు.. బాడీ పార్ట్స్‌పైనే  ఫోకస్ చేస్తున్నారంటూ సప్తమి గౌడ సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: ‘కాంతార’ (Kantara)సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి సప్తమి గౌడ(Sapthami Gowda), సినిమా వేడుకల్లో ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నటులను అసభ్యకరమైన కోణాల్లో చిత్రీకరించడంపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన పోస్ట్ పెట్టారు. పబ్లిక్ ఈవెంట్లలో ఫీమేల్ యాక్టర్స్ కనిపిస్తే, వారి నటన లేదా పని కంటే వారి శరీర భాగాలపైనే కెమెరాలు జూమ్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మేము ఇక్కడ ఉన్నది మా కళ కోసం, సినిమా కోసం. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా అసభ్యకరమైన యాంగిల్స్ నుంచి ఫొటోలు తీస్తూ మమ్మల్ని కించపరుస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది ఒక వ్యక్తి గౌరవానికి సంబంధించిన విషయం. ఈవెంట్లను కవర్ చేసే వారు వృత్తి నైపుణ్యాన్ని, కనీస మర్యాదను పాటించాలి.

ఇలాంటి పనులను మేము అస్సలు సహించము. ఈ విషయంలో మహిళా నటులమంతా ఐక్యంగా ఉన్నాము’’ అని రాసుకొచ్చారు. ఈ అసభ్యకరమైన ధోరణిని ఇకపై సాధారణ విషయంగా చూడకూడదని ఆమె స్పష్టం చేశారు. తన పోస్ట్‌కు ‘Actors Not Objects’ (మేము నటులం.. వస్తువులం కాదు) అనే క్యాప్షన్‌ను జోడించడం గమనార్హం. మీడియా మిత్రులు, జర్నలిస్టులు కూడా తమకు మద్దతుగా నిలవాలని ఆమె కోరారు. ప్రస్తుతం సప్తమి గౌడ్ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గతంలో కూడా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహి వంటి స్టార్ హీరోయిన్లు ఈ ‘జూమ్-ఇన్’ సంస్కృతిపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు సప్తమి గౌడ మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తడంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ మొదలైంది. ఒక నటిగా తన ఆత్మగౌరవం కోసం ఆమె తీసుకున్న ఈ నిర్ణయానికి నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. అమ్మడు ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story