శక్తివంతమైన కథలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది: ప్రియాభవానీ శంకర్

by Mallepaka Hamsa |

కావేరి ప్రపంచంలోకి అడుగు పెట్టడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి

శక్తివంతమైన కథలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది: ప్రియాభవానీ శంకర్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja,), క్లాస్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ(Shiva Nirvana) కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’(Irumudi). ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా.. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ చిత్రంలోని హీరోయిన్ ఎవరనేది రివీల్ చేశారు. ఈ మూవీలో రవితేజ సరసన టాలెంటెడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నట్లు ప్రకటిస్తూ.. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ ‘కావేరి’ అనే ఎమోషనల్ పాత్రలో కనిపించబోతోంది. విడుదల చేసిన పోస్టర్ ఎంతో అందంగా, గుండెలకు హత్తుకునేలా ఉంది. ఇందులో రవితేజ తన భార్య కావేరికి ఎంతో ప్రేమగా ముద్దు పెడుతుండగా, ఆ ప్రేమకు మురిసిపోయిన ఆమె కళ్లలో ఆనందబాష్పాలు కనిపిస్తున్నాయి.

ప్రత్యేకమైన అనుభూతి..

తన పాత్ర గురించి ప్రియా భవానీ శంకర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘కావేరి ప్రపంచంలోకి అడుగు పెట్టడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఇంతటి నిజాయితీ గల, శక్తివంతమైన కథలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తన మనసులోని మాటను పంచుకుంది. మాస్ హీరో రవితేజను, ఎమోషన్స్ పండించడంలో దిట్ట అయిన శివ నిర్వాణ ఎలా చూపిస్తారనే కుతూహలం అందరిలోనూ ఉంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ లోగోలో ఆధ్యాత్మికతతో పాటు మాస్ టచ్ కూడా ఉండటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. రవితేజ - ప్రియా భవానీ శంకర్ మొదటి సారి జోడీ కడుతుండటంతో వీరి కెమిస్ట్రీ చూసేందుకు సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. శివ నిర్వాణ మార్కు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు టాక్.

Next Story