ఫాలోవర్స్ కోసం సినిమాను బలి చేస్తున్నారు.. మీకు సిగ్గు అనిపించడం లేదా: కృష్ణవంశీ

by Mallepaka Hamsa |

కొంతమంది కేవలం ఫాలోవర్స్ కోసం సినిమాను బలి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఫాలోవర్స్ కోసం సినిమాను బలి చేస్తున్నారు.. మీకు సిగ్గు అనిపించడం లేదా: కృష్ణవంశీ
X

దిశ, సినిమా: సినిమా రిలీజ్ అయిన నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ రివ్యూల పై కృష్ణవంశీ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. అలా చేసే 90% మందిని ఆయన ‘మూర్ఖులు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘చాలా మంది రివ్యూలు రాసేవాళ్లు టికెట్ కూడా కొనకుండా ఫ్రీగా సినిమాలు చూస్తున్నారు. కానీ, అదే సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతూ సినిమాను చంపేయాలని చూడటం ఎంతవరకు న్యాయం?" అని ఆయన ప్రశ్నించారు. కనీసం ఒక వారం రోజుల పాటు రివ్యూలు ఇవ్వకుండా ఆగితే, అసలైన ప్రేక్షకులు సినిమాను చూసి జడ్జ్ చేస్తారు కదా అని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో రివ్యూలు రాసి, ఆ తర్వాత దర్శకులుగా మారిన వారిని ఉద్దేశిస్తూ.. ‘‘చాలా మంది రివ్యూలు రాసేవాళ్లు సినిమాలు తీసి అట్టర్ ప్లాప్ అయ్యారు. కనీసం ఒక్క సరైన స్క్రీన్ ప్లే కూడా వాళ్లు రాయలేకపోయారు. ఇతరుల పనిని విమర్శించడం సులభం, కానీ ఒక సినిమా తీయడం వెనుక ఉన్న కష్టం వాళ్లకు తెలియదు’’ అని అన్నారు. కొంతమంది కేవలం ఫాలోవర్స్ కోసం సినిమాను బలి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘నేనింతే’ సినిమాలోని డైలాగ్స్‌తో కౌంటర్ ఇస్తూ.. ‘‘సినిమా అనేది వేల కుటుంబాలకు అన్నం పెడుతుంది. అలాంటి సినిమాను నాశనం చేస్తూ మీరు అన్నం ఎలా తింటున్నారు? తినేటప్పుడు కనీసం మీకు సిగ్గు అనిపించడం లేదా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సినిమాపై నెగటివిటీని వ్యాప్తి చేసే ముందు ఆ సినిమా వెనుక ఉన్న వందల మంది కష్టాన్ని గుర్తించాలని ఆయన హెచ్చరించారు. కృష్ణవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story