సినిమా అవకాశాల కోసం లొంగిపోతున్నారు.. ఇది సరైన పద్ధతి కాదు.. క్యాస్టింగ్ కౌచ్‌పై నటి సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

కేవలం సినిమా రంగమే కాదు, ప్రతి రంగంలోనూ ఈ సమస్య ఉంది. కాకపోతే మా రంగంలో ఉన్నవారు ధైర్యంగా బయటకు వచ్చి చెబుతున్నారు కాబట్టి అందరికీ విషయాలు తెలుస్తున్నాయి.

సినిమా అవకాశాల కోసం లొంగిపోతున్నారు.. ఇది సరైన పద్ధతి కాదు.. క్యాస్టింగ్ కౌచ్‌పై నటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యకృష్ణ, తాజాగా క్యాస్టింగ్ కౌచ్ అంశంపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. బొమ్మరిల్లు, దేవదాస్, వినాయకుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించిన ఆమె, పరిశ్రమలో ఉన్న చీకటి కోణాల గురించి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోనే క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుందనే విమర్శలపై సత్యకృష్ణ స్పందిస్తూ.. "కేవలం సినిమా రంగమే కాదు, ప్రతి రంగంలోనూ ఈ సమస్య ఉంది. కాకపోతే మా రంగంలో ఉన్నవారు ధైర్యంగా బయటకు వచ్చి చెబుతున్నారు కాబట్టి అందరికీ విషయాలు తెలుస్తున్నాయి. అందమైన మహిళల పట్ల అవతలి వ్యక్తులకు ఆకర్షణ కలగడం అనేది సహజమైన విషయం.

కానీ, ఎవరైనా తన పరిమితులు దాటుతున్నప్పుడు వెంటనే నో అని చెప్పగలిగే ధైర్యం మహిళలకు ఉండాలి" అని ఆమె అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఇప్పటివరకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదని స్పష్టం చేస్తూనే, తన తోటి మహిళా నటీమణులు పడుతున్న ఇబ్బందులను తాను కళ్ళారా చూశానని ఆవేదన వ్యక్తం చేశారు. "సినిమా అవకాశాల కోసం కొంతమంది కాదనలేక తప్పుదోవ పడుతున్నారు. ఇది అస్సలు సరైన పద్ధతి కాదు. సినిమా లేకపోతే జీవితమే లేదు అని భ్రమపడే వారే ఇలాంటి వలలో పడుతున్నారు" అని చెప్పుకొచ్చారు. అవకాశాల కంటే ఆత్మగౌరవం ముఖ్యమని, ధైర్యంగా నిలబడితేనే ఇలాంటి సమస్యలను అరికట్టగలమని సత్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story