- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిన్నిస్ రికార్డుల రారాణి.. పద్మవిభూషణ్ ఆశా భోస్లే అరుదైన ప్రస్థానానికి ముగింపు!
ప్రపంచంలోనే అత్యధిక స్టూడియో రికార్డింగ్స్ పాటలు చేసిన సింగర్‌గా ఆశా భోస్లే 2011లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.

దిశ, సినిమా: భారతీయ సంగీత సామ్రాజ్యంలో ఒక ధ్రువతార నేలకొరిగింది. తన మధురమైన గాత్రంతో ఏడు దశాబ్దాల పాటు కోట్లాది మందిని ఉర్రూతలూగించిన దిగ్గజ గాయని ఆశా భోస్లే (1933-2026) ఇక లేరన్న వార్త యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లతా మంగేష్కర్ నీడలో కెరీర్ ప్రారంభించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని 'వాయిస్ ఆఫ్ ది నేషన్'గా ఎదిగిన ఆమె ప్రస్థానం ఒక అద్భుత కావ్యం. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ సోదరిగా కెరర్ ప్రారంభించిన ఆశా, తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అప్పట్లో లతాజీ మెలోడీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు. అయితే ఆశా మాత్రం తనకంటూ ఒక విలక్షణమైన, వెస్ట్రన్ టచ్ ఉన్న శైలిని ఏర్పరచుకున్నారు. శాస్త్రీయ సంగీతం, భజనలు, గజల్స్, పాప్, క్లబ్ సాంగ్స్.. ఇలా ఏ జోనర్ అయినా ఆశా గొంతులో పరవళ్లు తొక్కాల్సిందే. ముఖ్యంగా ఆర్.డి. బర్మన్ సంగీతంలో ఆమె పాడిన దమ్ మారో దమ్, పియా తూ అబ్ తో ఆజా వంటి పాటలు భారతీయ సంగీత దిశనే మార్చేశాయి.
అవార్డుల పంట, ప్రపంచ రికార్డులు
ప్రపంచంలోనే అత్యధిక స్టూడియో రికార్డింగ్స్ పాటలు చేసిన సింగర్‌గా ఆశా భోస్లే 2011లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది. రెండుసార్లు జాతీయ అవార్డులతో పాటు ఏడుసార్లు ఫిలింఫేర్ గెలుచుకున్న తర్వాత, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆమె అవార్డుల నామినేషన్ల నుండి తప్పుకోవడం ఆమె సంస్కారానికి నిదర్శనం.
ఇక ఆశా భోస్లే గారికి తెలుగు భాషతో విడదీయలేని అనుబంధం ఉంది. 'మాయాబజార్' వంటి క్లాసిక్ సినిమాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల వరకు ఆమె ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. వస్తాడు నా రాజు.. వంటి మధుర గీతాలు నేటికీ శ్రోతల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. 90వ దశకంలోనూ ఏఆర్ రెహమాన్ సంగీతంలో 'రంగీలా' వంటి చిత్రాలతో అప్పటి కుర్రకారును ఉర్రూతలూగించి, వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపించారు. ఆశా భోస్లే గారికి పాటలు పాడటమే కాకుండా వంట చేయడం అంటే ప్రాణం. ఆమెకు దుబాయ్, కువైట్ వంటి దేశాల్లో 'Asha's' పేరుతో స్వంత రెస్టారెంట్ నెట్‌వర్క్ కూడా ఉంది. బాలీవుడ్ ప్రముఖులు సైతం ఆమె చేతి వంట కోసం క్యూ కట్టేవారట. సంగీత సామ్రాజ్ఞిగా కీర్తి పొందిన ఆశా భోస్లే గారు లేకపోయినా, ఆమె పాడిన వేలాది పాటల రూపంలో ఆమె గొంతు ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.






