భయాన్ని పరిచయం చేసేందుకు సిద్ధమైన ‘అగధ’ మూవీ టీమ్.. టీజర్‌ విడుదలకు ముహూర్తం ఫిక్స్

by Mallepaka Hamsa |

ఒక బలి. రక్తదాహం. ఇంకా మరెంతో భయంకరమైనది.. ‘అగధ’ భీకర ప్రపంచంలోకి అడుగుపెట్టండి" అంటూ టీమ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

భయాన్ని పరిచయం చేసేందుకు సిద్ధమైన ‘అగధ’ మూవీ టీమ్.. టీజర్‌ విడుదలకు ముహూర్తం ఫిక్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, వర్షం, ఒక్కడు వంటి క్లాసిక్ సినిమాలతో నిర్మాతగా చరిత్ర సృష్టించిన ఎమ్మెస్ రాజు, ఇప్పుడు ‘అగధ’ అనే మిస్టికల్ థ్రిల్లర్ చిత్రంతో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా, ప్రేక్షకులకు ఒక సరికొత్త, వెన్నులో వణుకు పుట్టించే అనుభూతిని అందించబోతోంది. ఈ సినిమాలో ‘మా ఊరి పొలిమేర’ ఫేమ్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు శ్రవణ్ రెడ్డి, యంగ్ బ్యూటీ ఉల్కా గుప్తా, వనితా విజయ్ కుమార్ కూతురు జోవికా విజయ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం ప్రమోషన్ల పరంగా సోషల్ మీడియాలో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది. మూవీ మేకర్స్ ఎప్పటికప్పుడు నటీనటుల పోస్టర్లను విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.

తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మే 7న ఉదయం 10:20 గంటలకు ‘అగధ’ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనికి జోడించిన క్యాప్షన్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇస్తోంది. "ఒక బలి. రక్తదాహం. ఇంకా మరెంతో భయంకరమైనది.. ‘అగధ’ భీకర ప్రపంచంలోకి అడుగుపెట్టండి" అంటూ టీమ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాకుండా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ అందరిలో వణుకుపుట్టిస్తోంది. పదుల కొద్ది పెద్ది చేతులను కలిగిన పెద్ద అమ్మవారు విగ్రహం వద్ద మంటలు వస్తుండగా.. అక్కడ ఓ వ్యక్తి పెద్ద కత్తితో నరికిన తలను పట్టుకుని కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా.. కెరీర్ ప్రారంభంలో భారీ కమర్షియల్ హిట్లను అందించిన ఎమ్మెస్ రాజు, ఇటీవల కాలంలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నారు. ‘డర్టీ హరి’ వంటి సినిమాలతో తన రూట్ మార్చిన ఆయన, ఇప్పుడు ఈ మిస్టికల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. రక్తదాహం, బలి వంటి అంశాలను చూస్తుంటే, ఈ సినిమాలో ఏదో ఒక గూఢమైన రహస్యం దాగి ఉందని అర్థమవుతోంది. మరి మే 7న రాబోయే టీజర్ ఈ భీకర ప్రపంచాన్ని ఎలా పరిచయం చేస్తుందో వేచి చూడాలి.

Next Story