ఆ ఆరంభమే నన్ను ప్రయోగాలు చేసేలా మార్చి ఉండొచ్చు: సన్యా మల్హోత్రా

by Mallepaka Hamsa |

నేను నటిగా నన్ను నేను ఒక బాక్స్‌లో బంధించుకోవాలని అనుకోను. గతంలో చేసిన పాత్రలనే మళ్ళీ చేస్తూ కంఫర్ట్ జోన్‌లో ఉండిపోవడం నాకు ఇష్టం లేదు.

ఆ ఆరంభమే నన్ను ప్రయోగాలు చేసేలా మార్చి ఉండొచ్చు: సన్యా మల్హోత్రా
X

దిశ, సినిమా: బాలీవుడ్ టాలెంటెడ్ నటి సన్యా మల్హోత్రా వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. తన మొదటి సినిమా ‘దంగల్’ నుండి ‘మిసెస్’ వరకు ప్రతి చిత్రంలోనూ తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, నటనపై ఉన్న మక్కువ తన ప్రత్యేకమైన పనితీరు గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. స్క్రిప్ట్ ఎంపిక గురించి సన్యా మాట్లాడుతూ.. "నేను నటిగా నన్ను నేను ఒక బాక్స్‌లో బంధించుకోవాలని అనుకోను. గతంలో చేసిన పాత్రలనే మళ్ళీ చేస్తూ కంఫర్ట్ జోన్‌లో ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. కొత్తగా ఏదైనా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. నా మొదటి సినిమా 'దంగల్' కోసమే జుట్టు కత్తిరించుకుని, రెజ్లింగ్ నేర్చుకున్నాను. బహుశా ఆ ఆరంభమే నన్ను ప్రయోగాలు చేసేలా మార్చి ఉండొచ్చు. అదృష్టవశాత్తూ నాకు చాలా మంచి స్క్రిప్టులు వస్తున్నాయి" అని తెలిపింది.

సన్యా తన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడానికి ఒక విభిన్నమైన పద్ధతిని అనుసరిస్తుంది. "నాకు వాసన అనేది చాలా ముఖ్యం. నేను చేసే ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన పర్ఫ్యూమ్ ఉపయోగిస్తాను. కొన్నిసార్లు పాత పర్ఫ్యూమ్ ఉపయోగిస్తుంటే ఆ పాత్ర తాలూకు జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తాయి. అలాగే నేను నా పాత్రలాగా డైరీ రాస్తాను. ‘పగ్లాయిట్’ సినిమా కోసం నేను సంధ్య పాత్రలా మారి కవితలు రాశాను. అది నాలోని నటిని మేల్కొల్పుతుంది" అని ఆమె వివరించింది. ప్రేక్షకులు తన నుండి ఎప్పుడూ వినూత్నమైన పాత్రలను కోరుకుంటారని, అది తనకు ఒత్తిడిగా అనిపించదని సాన్యా స్పష్టం చేసింది. 2024లో వచ్చిన ‘మిసెస్’ సినిమా తన కెరీర్‌లో ఒక మైలురాయి అని ఆమె పేర్కొంది. "చాలామంది మహిళలు ఈ చిత్రం చూసి, ఇది మా కథ అని చెబుతుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఆ పాత్ర చాలామందిలో స్ఫూర్తి నింపిందని నమ్ముతున్నాను" అని చెప్పింది.

Next Story