మహేష్‌ను అవమానించిన శ్రీలీల.. చర్చనీయాంశంగా మారిన వీడియో.. అసలు ఏం జరిగిందంటే?

by Mallepaka Hamsa |

శ్రీలీల ఒక అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఒక చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఆమె ఒక నటుడిని అవమానించిందంటూ నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు.

మహేష్‌ను అవమానించిన శ్రీలీల.. చర్చనీయాంశంగా మారిన వీడియో.. అసలు ఏం జరిగిందంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల ఒక అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఒక చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఆమె ఒక నటుడిని అవమానించిందంటూ నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పైన శ్రీలీల నిల్చొని ఉండగా, ఆమె వెనుక నటుడు మహేష్ నిలబడి ఉన్నారు. ఆ సమయంలో శ్రీలీల వెనక్కి తిరిగి మహేష్ వైపు చాలా సీరియస్‌గా చూసింది.

వెంటనే మహేష్ ఆమెను చూసి నవ్వగా, ఆమె మాత్రం ఏమాత్రం స్పందించకుండా అంతే సీరియస్‌గా స్క్రీన్ వైపు తిరిగిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు నెటిజన్లు, శ్రీలీలకి గర్వం పెరిగిపోయిందని, తోటి నటుడిని కనీసం పలకరించకుండా అవమానించిందని విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదం కాస్త ముదిరి శ్రీలీల మీద ట్రోలింగ్ తీవ్రమవడంతో, నటుడు మహేష్ స్వయంగా స్పందించి అసలు విషయం చెప్పారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అసలు విషయాన్ని వివరిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. "శ్రీలీల గారు స్టేజ్ మీదకు వెళ్లే ముందు తన ఫోన్‌ను పట్టుకోమని నాకిచ్చారు. ఈవెంట్ మధ్యలో ఆమె వెనక్కి తిరిగినప్పుడు, ఫోన్ కోసమే నా వైపు చూస్తున్నారేమోనని నేను అనుకున్నాను. కానీ ఆమె స్క్రీన్ మీద ఏదో చూస్తూ వెంటనే అటు తిరిగిపోయారు.

అక్కడ అంతకు మించి ఏమీ జరగలేదు. ఆమె నన్ను అగౌరవపరచలేదు, దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి" అని క్లారిటీ ఇచ్చారు. మహేష్ ఇచ్చిన వివరణతో శ్రీలీల మీద వస్తున్న ట్రోల్స్‌కు చెక్ పడినట్లయింది. కేవలం ఒక చిన్న మూమెంట్‌ను పట్టుకుని సోషల్ మీడియాలో రాద్ధాంతం చేశారని ఆమె అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ క్లారిటీతో వివాదం సద్దుమణిగింది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

Next Story