షూటింగ్ సెట్‌లో గాయపడిన శ్రద్ధా కపూర్.. హాస్పిటల్ బెడ్‌పై ఉండటంతో ఆందోళనలో అభిమానులు

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor)షూటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడినట్లు సమాచారం.

షూటింగ్ సెట్‌లో గాయపడిన శ్రద్ధా కపూర్.. హాస్పిటల్ బెడ్‌పై ఉండటంతో ఆందోళనలో అభిమానులు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor)షూటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ ‘ఈఠా’(eetaa) షూటింగ్ నాసిక్‌లో జరుగుతోంది. భారీ సెట్ వేసి ఒక పాటను చిత్రీకరిస్తున్న సమయంలో బరువైన అభరణాలు, నౌ వారీ చీర ధరించి ఉన్న శ్రద్ధా స్పీడ్ డ్యాన్స్ మూమెంట్స్ చేస్తుండగా.. బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయిందట. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించిన చిత్రబృందం చికిత్స అందించగా.. డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. బరువు మొత్తం ఎడమ కాలిపై పడటంతో కాలు ఫ్రాక్చర్ కాగా నొప్పి ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్‌ను కూడా నిలిపివేశారని టాక్. ఈ విషయం కాస్త బయటకు రావడంతో శ్రద్ధా అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతూ ఆమెకు మెసేజ్‌లు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ నెటిజన్ మీ గాయం ఎలా ఉంది అడగ్గా.. దానికి శ్రద్ధా స్పందించి హాస్పిటల్ బెడ్‌పై ఉన్న వీడియో షేర్ చేసింది. ‘‘అది పెద్ద దెబ్బ ఏం కాదు. కాలి కండరానికి దెబ్బ తగిలి కొంచెం ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమన్నారు. నేను క్షేమంగా ఉన్నాను. మీరంతా కంగారు పడకండి. త్వరలోనే కోలుకుని ఆరోగ్యంగా మీ ముందుకు వస్తాను’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. రెండు వారాల్లో ఈ షూటింగ్ మళ్లీ ప్రారంభం కాబోతున్నట్లు టాక్.

కాగా.. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar)దర్శకత్వంలో రాబోతున్న ‘ఈఠా’ మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణగావ్కర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. తమాషా సామాజ్ఞిగా పేరుగాంచిన విఠాబాయి జానపద నృత్యాన్నికి చేసిన సేవలకు గాను ఆమెకు 1957, 1990 రాష్ట్రపతి పురస్కారాలను కూడా సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇప్పుడు ఆమె పాత్రలో శ్రద్ధా కపూర్ నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story