వివాదాస్పద కథతో 15 ఏళ్ల తర్వాత సమీరా రెడ్డి రీఎంట్రీ..

by Mallepaka Hamsa |

దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రాబోతుండటం విశేషం.

వివాదాస్పద కథతో 15 ఏళ్ల తర్వాత సమీరా రెడ్డి రీఎంట్రీ..
X

దిశ, సినిమా: ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ తెరలపై తన గ్లామర్‌తో మెప్పించిన నటి సమీరా రెడ్డి. ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ, కోలీవుడ్, మాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసింది. అయితే, కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్న సమీరా, ఆ తర్వాత వెండితెరకు పూర్తిగా దూరమైపోయింది. భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో బిజీగా గడిపిన ఆమె, ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రాబోతుండటం విశేషం. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆఖ్రీ సవాల్’ చిత్రంతో సమీరా రెడ్డి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది. ఇందులో ఆమె ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. తన రీ-ఎంట్రీ గురించి సమీరా మాట్లాడుతూ.. ఇకపై పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటానని స్పష్టం చేసింది. కేవలం గ్లామర్ కోసం చేసే రొటీన్ కమర్షియల్ పాత్రల కంటే, నటనకు ఆస్కారం ఉండి, సమాజానికి ఏదైనా సందేశం ఇచ్చే అర్థవంతమైన పాత్రలకే తన మొగ్గు ఉంటుందని ఆమె వెల్లడించింది.

జాతీయ అవార్డు గ్రహీత అభిజీత్ మోహన్ వారంగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ప్రయాణాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌పై గతంలో వచ్చిన ఆరోపణలు, ఇందిరా గాంధీ హత్య తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత వంటి సున్నితమైన, వివాదాస్పద అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ప్రొఫెసర్ గోపాల్ నాదకర్ణి అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు నమాశి ఇందులో పీహెచ్‌డీ విద్యార్థిగా నటిస్తున్నారు. బలమైన కథ, వివాదాస్పద రాజకీయ అంశాలు,సమీరా రెడ్డి రీ-ఎంట్రీ తో తోడవ్వడంతో ‘ఆఖ్రీ సవాల్’ చిత్రంపై ఇప్పుడే బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే8న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story