విజయ్, త్రిష వివాదంలోకి రవి మోహన్ మాజీ భార్య ఎంట్రీ.. సంచలనంగా మారిన ఇన్‌స్టా పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-27 08:31:57  IST  )

ఒక భార్య గౌరవం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతుండటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. పెళ్లి బంధం అందరి ముందు విడిపోతుంటే ఆ మహిళ పడే వేదన, అవమానం గురించి చర్చించడం మంచిదే.

విజయ్, త్రిష వివాదంలోకి  రవి మోహన్ మాజీ భార్య ఎంట్రీ.. సంచలనంగా మారిన ఇన్‌స్టా పోస్ట్
X

దిశ, సినిమా: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుల వ్యక్తిగత జీవితాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా దళపతి విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకోవడం, నటి త్రిషతో ఆయనకున్న సాన్నిహిత్యంపై వస్తున్న వార్తలు నెట్టంట సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. జయం రవి ( రవి మోహన్) మాజీ భార్య ఆర్తీ రవి సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వడం, మరోవైపు త్రిషతో కలిసి బహిరంగంగా కనిపించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై ఆర్తీ రవి స్పందిస్తూ.. "ఒక భార్య గౌరవం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతుండటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. పెళ్లి బంధం అందరి ముందు విడిపోతుంటే ఆ మహిళ పడే వేదన, అవమానం గురించి చర్చించడం మంచిదే. కానీ, గత ఏడాది నా విషయంలో ఇలాంటి పరిస్థితులే ఎదురైనప్పుడు అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని ప్రశ్నించారు. ఆర్తీ రవి తన పోస్ట్‌లో ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆమె వాడిన పొలిటికల్ అనే పదం చూసి విజయ్ గురించేనని నెటిజన్లు భావిస్తున్నారు.

"భార్యపై చూపే జాలి అనేది సదరు వ్యక్తికి ఉన్న మార్కెట్ విలువను బట్టి మారుతుందా? లేక రాజకీయ, సామాజిక కారణాల వల్ల ఆమె బాధను గుర్తిస్తున్నారా?" అని ఆమె నిలదీశారు. గత ఏడాది రవి మోహన్, కెనిషా ఫ్రాన్సిస్‌తో కలిసి ఒక వివాహ వేడుకకు వెళ్లినప్పుడు తనపై లేనిపోని అపనిందలు వేశారని, కానీ ఇప్పుడు విజయ్ విషయంలో మాత్రం అందరూ భార్య వైపు మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ఏ భార్య కూడా ఇలాంటి అవమానాన్ని నిశ్శబ్దంగా భరించకూడదు. సానుభూతి అనేది కేవలం శక్తివంతులకే పరిమితం కాకూడదు" అని ఆర్తీ రవి పేర్కొన్నారు. ఆమె పోస్ట్‌కు నెటిజన్ల నుండి భారీ మద్దతు లభిస్తోంది. ధైర్యంగా ఉండు అక్కా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, ఆమె చేతిపై ఉన్న రవి పేరు టాటూను తొలగించి, విడాకుల ప్రక్రియను త్వరగా ముగించాలని కొందరు సలహా ఇస్తున్నారు. రవి మోహన్ 2024లో తన భార్య ఆర్తీ నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

దయచేసి ప్రాణాలు కాపాడండి.. మోదీ, రేవంత్ రెడ్డికీ కీలక విజ్ఞప్తి చేస్తూ రాహుల్ రామకృష్ణ ఎమోషనల్ పోస్ట్

Next Story